R Krishnaiah: సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ఆర్. కృష్ణయ్య హర్షం
ABN , Publish Date - Jan 30 , 2024 | 10:02 PM
బీసీ కుల గణన చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
బీసీ కుల గణన చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కుల గణన చేపడుతామని సీఎం చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కుల గణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ ప్రభుత్వ పథకాల్లో సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. అధికారం చేపట్టిన రోజు నుంచే తెలంగాణలో ప్రజాపాలనను అందిస్తున్నందుకు సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కుల గణన బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో.. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ కృష్ణయ్య కోరినట్లు తెలిసింది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన వాగ్ధానాలను గుర్తు చేస్తూ.. ఈ హామీలను అమలు చేస్తారనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత మంత్రివర్గ నిర్మాణంలో బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని.. వచ్చే విస్తరణలో బీసీలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్‌లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. భేటీలో సీఎం వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.