Share News

R. Krishnaiah: బీసీ ఉద్యమ బలోపేతానికే రాజీనామా

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:22 AM

బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణయ్య మాట్లాడారు.

R. Krishnaiah: బీసీ ఉద్యమ బలోపేతానికే రాజీనామా

  • ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు: ఆర్‌.కృష్ణయ్య

  • కృష్ణయ్యతో కాంగ్రెస్‌ నేతల భేటీ.. పార్టీలోకి రావాలని ఆహ్వానం

రాంనగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణయ్య మాట్లాడారు. బీసీ ఉద్యమ నాయకుడిగా జగన్‌ తనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారని, ఆ పదవికి న్యాయం చేశానని చెప్పారు. అయితే రాజ్యసభలో బీసీల డిమాండ్లపై తాను పోరాటం చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. పోరాటం ద్వారానే బీసీలకు అధికారం వస్తుందని, డిమాండ్లు పరిష్కారం అవుతాయని భావించి రాజ్యసభకు మరో నాలుగు సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ తాను రాజీనామా చేశానని తెలిపారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని కృష్ణయ్య పేర్కొన్నారు.


మరోవైపు ఆర్‌. కృష్ణయ్యతో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్యే మల్లు రవి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న భేటీ అయ్యారు. విద్యానగర్‌లో కృష్ణయ్యను కలిసి వీహెచ్‌ ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఆర్‌.కృష్ణయ్య రాజ్యసభ్య సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. అందుకే కృష్ణయ్యను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని కోరారని వీహెచ్‌ తెలిపారు. అలాగే బీసీ భవన్‌లో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వేర్వేరుగా కృష్ణయ్యతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని కృష్ణయ్యను వారు ఆహ్వానించారు. అయితే కృష్ణయ్య వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు, భవిష్యత్‌ నిర్ణయాన్ని త్వరలో చెప్తానని పేర్కొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 04:22 AM