Rahul Gandhi: మోదీ వచ్చాక పేదలు మరింత నిరుపేదలయ్యారు.. జనజాతర సభలో రాహుల్ గాంధీ
ABN , Publish Date - Apr 06 , 2024 | 08:21 PM
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలోని పేదలు మరింత నిరుపేదలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే రుణమాఫీ చేశారు గానీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలోని పేదలు మరింత నిరుపేదలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే రుణమాఫీ చేశారు గానీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా న్యాయపత్రం పేరిట మేనిఫెస్టో (Congress Manifesto) విడుదల చేసిన రాహుల్ గాంధీ.. తాను మేనిఫెస్టో రిలీజ్ చేయడానికే వచ్చానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడే తమ గ్యారెంటీలను విడుదల చేశామని.. ప్రజల గొంతుని వినిపించేలా తాజా మేనిఫెస్టోని సిద్ధం చేశామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?
ఇప్పటికే తెలంగాణలో 30వేల ఉద్యోగాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని.. మరికొన్ని ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల మనసులోని మాటలే తమ మేనిఫెస్టోలో ఉన్నాయని.. తామిస్తున్న ఐదు గ్యారెంటీలు తమ మేనిఫెస్టోకి ఆత్మలాంటివని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని.. వారికి ప్రత్యేక్ష శిక్షణ ఇస్తామని.. అన్ని రంగాల్లోని నిరుద్యోగులకు సంవత్సరానికి రూ.1 లక్ష చొప్పున స్టైఫండ్‌తో ట్రైనింగ్ ఇప్పిస్తామని మాటిచ్చారు. ఉద్యోగాలు చేసే మహిళలు.. ఆఫీసులో, ఇంట్లో కలిపి రెండు ఉద్యోగాలు చేస్తున్నారని ప్రశంసించారు. సంవత్సరానికి ప్రతి పేద మహిళకు రూ.1 లక్ష ఇస్తామని, ఆ డబ్బులను నేరుగా బ్యాంకుల్లో వేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో తరహాలోనే దేశంలోనూ కులగణన చేస్తామని, కులగణన చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని వెల్లడించారు.
Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం
దేశంలో ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు.. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాటిచ్చారు. అలాగే.. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు కనీసం వేతనం రోజుకి రూ.400 అందిస్తామని చెప్పారు. భారత్‌లోనే ప్రముఖ కంపెనీ ఓనర్లలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లేరని.. అన్ని రంగాల్లో వారి భాగస్వామ్యం ఉండాల్సినంత లేదని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో కూడా సర్వే చేసి.. భారత్‌లోని ధనం ఎవరి దగ్గర ఉందో బయటపెడతామని అన్నారు. ప్రజల హక్కులను ప్రజలకు తప్పకుండా అందించి తీరుతామని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి