Share News

వైద్య బిల్లుల చెల్లింపునకు సుస్తీ

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:32 AM

దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన ఆయన విశ్రాంత న్యాయమూర్తి. ఆయన భార్య కూడా విశ్రాంత న్యాయమూర్తే. తీవ్ర అనారోగ్యానికి గురవగా వైద్యం చేయించారు.

వైద్య బిల్లుల చెల్లింపునకు సుస్తీ

  • ఫిబ్రవరిలో సమర్పించినవి ప్రస్తుతం పరిశీలన.. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో తీవ్ర ఆలస్యం

  • ఆస్పత్రుల ఎంప్యానెల్‌ రెన్యువల్‌లోనూ కొర్రీలు

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన ఆయన విశ్రాంత న్యాయమూర్తి. ఆయన భార్య కూడా విశ్రాంత న్యాయమూర్తే. తీవ్ర అనారోగ్యానికి గురవగా వైద్యం చేయించారు. ఆ ఖర్చును తిరిగి (రీయుంబర్స్‌మెంట్‌) పొందేందుకు బిల్లులు పెట్టారు. కానీ, వైద్య విద్య సంచాలకుడి (డీఎంఈ) కార్యాలయం సిబ్బంది ఎన్ని నెలలైనా పరిశీలించలేదు. పలుసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోగా నిర్లక్ష్య సమాధానం వచ్చింది. దీంతో ఆ విశ్రాంత న్యాయమూర్తి.. ఓ ఐఎఎ్‌సను సాయమడిగారు. ఆయన పలుసార్లు డీఎంఈ కార్యాలయానికి ఫోన్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి.. ఉద్యోగుల చికిత్సల అనుమతి పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఫైర్‌ ఎన్‌వోసీ లేదని తిరస్కరించారు. నిబంఽధనల మేరకు 15 మీటర్ల లోపు ఎత్తున్న భవనాలకు ఈ ఎన్‌వోసీ అవసరం లేదు. కానీ, డీఎంఈ తిరస్కరించారు.


దీంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఉద్యోగులకు చెల్లింపులు నిలిచిపోయాయి. పై రెండు ఊదాహరణలు డీఎంఈ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎంతటి అత్యవసర విషయాలనైనా పట్టించుకోరన్న ఆరోపణలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లేదా ఆరోగ్య శాఖ కార్యదర్శి అడిగితే తప్ప చేయని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు వారు చెప్పిన అత్యవసర ఫైల్స్‌నూ రోజుల కొద్దీ జాప్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇంచార్జి డీఎంఈ డాక్టర్‌ వాణి, అకడమిక్‌ ఇంచార్జి డాక్టర్‌ శివరాంప్రసాద్‌ ఏ విషయంలోనూ త్వరిత నిర్ణయాలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వీరిపై మంత్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రిటైరైన, పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే.. రూ.50 వేలలోపు బిల్లులను జిల్లా అధికారులే మంజూరు చేస్తారు. మించితే డీఎంఈకి పంపుతారు. అన్నిటినీ పరిశీలించి ఎంత ఇవ్వాలో కార్యాలయ వైద్యులు నిర్ణయిస్తారు. ఇక్కడ రూ.2లక్షల వరకు మంజూరు చేయొచ్చు. అది దాటితే ప్రభుత్వానికి పంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 100-150 దరఖాస్తులు డీఎంఈకి వస్తాయి. కాగా, సకాలంలో పరిష్కరించకపోవడంతో పేరుకుపోయాయి. ఫిబ్రవరిలో ఇచ్చిన బిల్లులను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దీంతో విశ్రాంత ఉద్యోగులు డీఎంఈ చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్య బిల్లులను ఆన్‌లైన్‌ చేయాలని, పరిశీలనను ఆరోగ్య శ్రీ కార్యాలయానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినా అమలు కావడానికి కొన్ని నెలలు పట్టేలా ఉంది.


  • రెన్యూవల్‌లో ద్వంద్వ వైఖరి

ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స) కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందవచ్చు. ప్రైవేటు ఆస్పత్రులు కచ్చితంగా ఎం-ప్యానెల్‌ అయి ఉండాలి. డీఎంఈ కార్యాలయం ఇచ్చే ఈ అనుమతిని గడువు ముగియకముందే పునరుద్ధరించుకోవాలి. ప్రస్తుతం పదుల కొద్దీ ప్రైవేటు ఆస్పత్రులు డీఎంఈ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పటికప్పుడు చేయాల్సి ఉన్నా నిబంధనల సాకు చూపి దాటవేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి 15 మీటర్ల మించి ఎత్తు ఉండి, అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం లేకున్నా అనుమతిని పునరుద్ధరించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ప్రైవేటు ఆస్పత్రి భవనం 15 మీటర్ల లోపు ఎత్తున్నా తిరస్కరించారు. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు విసుగెత్తాయి. ఇలాగైతే చికిత్సలు చేయలేమని తేగేసి చెబుతున్నాయి. మంత్రి దామోదరను కలిసి ఫిర్యాదు చేసే ఉద్దేశంలో ఉన్నాయి.

Updated Date - Nov 30 , 2024 | 04:33 AM