Share News

Land Survey: రాష్ట్రంలో సర్వేయర్ల కొరత!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:57 AM

భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ‘అనుభవదారుల సర్వే’ చేయించి, శాశ్వత పరిష్కారం చూపుతామని భూభారతి చట్టం-2024లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Land Survey: రాష్ట్రంలో సర్వేయర్ల కొరత!

‘భూ భారతి’ అమల్లో వారే కీలకం.. మండలాల్లో అరకొరగానే సిబ్బంది

  • రాష్ట్రవ్యాప్తంగా 600కి పైగా ఖాళీలు

  • సంక్రాంతిలోపు 1000 మందిని నియమిస్తామన్న మంత్రి పొంగులేటి

  • ఇప్పటికీ ఖరారవని విధివిధానాలు

  • 3 వారాల్లో నియామకాలు సాధ్యమేనా?

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ‘అనుభవదారుల సర్వే’ చేయించి, శాశ్వత పరిష్కారం చూపుతామని భూభారతి చట్టం-2024లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2014కి ముందు పాస్‌పుస్తకాలు ఉండి, అనుభవదారులుగా ఉన్న వారు ధరణి అమల్లోకి వచ్చాక రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని, భూభారతి చట్టం ద్వారా ఇలాంటి వారికి న్యాయం చేస్తామని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని రేవంత్‌ సర్కారు స్పష్టం చేసింది. పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురికావద్దని తెలిపింది. అయితే భూభారతి చట్టం అమల్లో సత్ఫలితాలు రావాలంటే కీలకమైన సర్వే విభాగాన్ని బలోపేతం చేయాలని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


సగానికిపైగా ఖాళీలే..

ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. త్వరలో మండలాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో సుమారు 1000 మంది సర్వేయర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం 410 మందే ఉన్నారు. తగినంత మంది సర్వేయర్లు లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఒక సర్వేయరే రెండు మూడు మండలాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. డబ్బులు ఇస్తే తప్ప కదలరనే ఆరోపణలు ఉన్న తరుణంలో.. అరకొరగా ఉన్న సర్వేయర్లతో రైతులు, ప్రజలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ లాంటి చోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విసిగిపోతున్నారు. మండల కేంద్రాల్లో పెండింగ్‌ దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి.


సంక్రాంతిలోపు భర్తీ అయ్యేనా..?

సంక్రాంతిలోపు గ్రామ రెవెన్యూ సిబ్బందితోపాటు సర్వేయర్ల నియామకం చేపడతామని ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. గతంలో పని చేసిన వీఆర్‌వోల నుంచే సర్వేకు అవసరమైన 1000 మందిని నియమిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారవలేదు. సంక్రాంతికి ఇంకా మూడు వారాలే ఉంది. ఆలోపు నియామకాలు సాధ్యమా? అన్నది ప్రభుత్వానికే తెలియాలి.

Updated Date - Dec 28 , 2024 | 05:57 AM