Medaram Jatara: మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:13 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టింది. జాతరకు ముందు తాత్కాలిక సౌకర్యాలు కల్పించే ఆనవాయితీకి ఇక చెక్ పెట్టేసి.. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని సంకల్పించింది.
భక్తులకు శాశ్వత సౌకర్యాల కోసం ప్రణాళిక.. ప్రశాంతంగా దర్శించుకునేలా గద్దెల విస్తరణ
ట్రాఫిక్ నియంత్రణ..రోడ్ల విస్తరణ
కాటేజీల నిర్మాణం
2026 మహాజాతరకు ముందే పనుల ప్రారంభం
వచ్చే ఏడాది జరిగే మినీ జాతరకు రూ.3.86 కోట్లు
ములుగు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టింది. జాతరకు ముందు తాత్కాలిక సౌకర్యాలు కల్పించే ఆనవాయితీకి ఇక చెక్ పెట్టేసి.. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని సంకల్పించింది. ఇందుకు మంత్రి సీతక్క చొరవతో మేడారం అభివృద్ధి కోసం సర్కారు ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 2026 మహాజాతరకు ముందే పనుల ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఎన్ని కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించనుం దనేది తెలియరాలేదు.
ఆ అభివృద్ధి పనులు ఏమిటి?
రెండేళ్లకోసారి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారు. ఈ స్థాయిలో వచ్చే భక్తుల కోసం అక్కడ పెద్దగా సౌకర్యాలు లేవు. సమక్క-సారలమ్మ గద్దెల పరిసరాలు ఇరుకుగా ఉన్నాయి. ప్రవేశ ద్వారాలు, బయటకు వెళ్లే మార్గాలు చిన్నగా ఉండటంతో భక్త జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొక్కిసలాట జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు గద్దెలు విస్తరించనున్నారు. మేడారం సమీపంలోని మార్గాల్లో ట్రాఫిక్ జాం సమస్యను అధిగమించేందుకు రహదారులను విస్తరించనున్నారు. ఇందులో భాగం గా పస్రా-మేడారం, తాడ్వాయి-మేడారం, కొండాయి, భూపాలపల్లిని కలిపే కాల్వపల్లి, గొల్లబుద్దారం బయ్యక్కపేట రోడ్లను విస్తరించనున్నారు. జాతరకు 20 కి.మీ దూరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నారు. మేడారంలో అంతర్గత రోడ్లనూ వెడల్పు చేయనున్నారు. మేడారానికి మహాజాతరప్పుడే కాకుండా ఏడాది పొడుగునా భక్తులు వస్తుంటారు. భక్తులు.. తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వచ్చి మేడారంలో హాయిగా విడిది చేసేందుకు శాశ్వత ప్రాతిపదికన కాటేజీలు నిర్మించనున్నారు. అయితే గతంలో కేటాయించిన నిధులతో మేడారంలో పూజారుల విశ్రాంతి భవన సముదాయం, మేడారం-ఊరట్టం సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా రూ.17 కోట్ల 50 లక్షలతో రోడ్లు, రూ.3కోట్ల 50 లక్షలతో గెస్ట్‌హౌస్ పనులు చేస్తున్నారు. కాగా, మేడారంలో రెండేళ్లకోసారి జరిగేది మహాజాతర అయితే ఏటా జరిగేది మినీ జాతర! వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ జాతర జరగనుంది. ఈ జాతరకు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.3.86 కోట్లు కేటాయించింది.