Share News

Ponguleti : ఎన్ని గంటలకు... ఎక్కడికి రావాలి

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:54 AM

అమృత్‌ పథకంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని బావా, బామ్మర్ధులు గొంతుచించుకుంటున్నారని, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి కేటీఆర్‌, హరీశ్‌లకు సవాల్‌ విసిరారు.

Ponguleti : ఎన్ని గంటలకు... ఎక్కడికి రావాలి

  • చెప్తే అక్కడికి వస్తా.. అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. బావ, బావమరుదులకు అంతర్గత విభేదాలున్నాయ్‌

  • ఎవరినెవరు వెన్నుపోటు పొడుచుకునేది తెలియదు

  • కేటీఆర్‌, హరీశ్‌లపై మండిపడ్డ మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి, ఇల్లెందు, సెప్టెంబరు 23: అమృత్‌ పథకంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగిందని బావా, బామ్మర్ధులు గొంతుచించుకుంటున్నారని, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి కేటీఆర్‌, హరీశ్‌లకు సవాల్‌ విసిరారు. లేకుంటే, వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని గంటలకు ఎక్కడకు రావాలో చెబితే అక్కడకు వస్తానని సవాల్‌ విసిరారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పొంగులేటి పాల్గొని ప్రసంగించారు.


అమృత్‌ స్కీంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు కందాళ అల్లుడు సృజన్‌రెడ్డికే టెండర్‌ దక్కిందన్నారు. కాళేశ్వరం, మిషన్‌భగీరఽథ పేరుతో లక్షల కోట్లు దోచుకుతిన్న ప్రభుత్వం తమది కాదని ఆయన ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం తమదన్నారు. కేటీఆర్‌నుద్దేశించి మాట్లాడుతూ... ఆయనకు, ఆయన బావకు అంతర్గత తగాదాలున్నాయని, అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరు, ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో ప్రజలకు తెలుసునన్నారు. తమపై నింద మోపే ముందు వారి పార్టీని చక్కబెట్టుకోవాలని మండిపడ్డారు.


అంతకుముందు ఇల్లెందు నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలు, భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కారు భూములు కబ్జాలకు గురైతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ విధానాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసే ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కూడా అమలు చేయబోతున్నందున అర్హులైన పేదలను పార్టీలకు అతీతంగా గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 02:54 AM