Asifabad: మరో ఇద్దరికి విషమం
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:52 AM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్న విద్యార్థినుల సంఖ్య పెరిగిపోతోంది.
వాంకిడి విద్యార్థులు నిమ్స్‌కు తరలింపు
మరొకరికి వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స
ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు
గురైన వారిలో 35 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే
వాంకిడి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్న విద్యార్థినుల సంఖ్య పెరిగిపోతోంది. శైలజ అనే విద్యార్థినికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. వీరికితోడు శనివారం సాయంత్రం ఇద్దరు, ఆదివారం ఉదయం మరో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వాంకిడి ఆస్పత్రుల్లో చేర్పించారు. శనివారం మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ఆస్పత్రులకు తరలించిన విద్యార్థినులు ఇంకా కోలుకోలేదు.
మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కుడ్మెత జ్యోతి (9వతరగతి), మహాలక్ష్మి (8వతరగతి) అనే విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారడంతో వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం మొత్తం 35 మంది విద్యార్థినులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ పాఠశాలలో గత బుధవారం నుంచి ఇప్పటివరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య 60 దాటింది. దీంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు. పాఠశాలలో మొత్తం 591 మంది విద్యార్థినులకుగాను ప్రస్తుతం 120 మంది మాత్రమే ఉన్నారు.