Share News

Unemployed Doctors: డాక్టర్‌ నిరుద్యోగి!

ABN , Publish Date - Dec 12 , 2024 | 02:30 AM

రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగ డాక్టర్ల (ఎంబీబీఎస్‌) సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు! గతంలో సర్కారు కొలువులంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది.

Unemployed Doctors: డాక్టర్‌ నిరుద్యోగి!

  • పెరుగుతున్న ఎంబీబీఎస్‌లు...తగ్గుతున్న ఉపాధి అవకాశాలు

  • నెలకు రూ.20-30 వేలే.. నర్సులకన్నా తక్కువ జీతం

  • గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు

  • ఇప్పుడు వేలల్లో అర్జీలు.. 30 పోస్టులకు 350పైనే

  • తెలంగాణ వచ్చాక 32 వేల మంది కొత్త వైద్యులు

  • దేశవ్యాప్తంగా లక్షన్నర మంది నిరుద్యోగ వైద్యులు

  • డబ్ల్యూహెచ్‌వో ప్రకారం వెయ్యి మందికి ఒక డాక్టర్‌

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒకరు

  • మున్ముందు ఇంజనీరింగ్‌ కాలేజీల్లాగే వైద్యవిద్య

  • తెలంగాణలో నాలుగు సంవత్సరాల తర్వాత ఏటా పది వేల మంది కొత్త డాక్టర్లు

ఈ ఏడాది జూలై 12న ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో వైద్య పోస్టుల భర్తీకిగాను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో ఒకే ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (డెంటల్‌ సర్జరీ) పోస్టు ఉండగా, దానికి ఏకంగా 134 దరఖాస్తులొచ్చాయి. అదేనెల 2న బోర్డు 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల (ఎంబీబీఎస్‌ వైద్యులు) పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి ఏకంగా 4,850 దరఖాస్తులొచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని పలు బస్తీ దవాఖానాల్లో 30 ఎంబీబీఎస్‌ పోస్టులకు డీఎంహెచ్‌వో కార్యాలయం నోటిఫికేషన్‌ ఇస్తే.. 350 వరకు దరఖాస్తులొచ్చాయి.

రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగ డాక్టర్ల (ఎంబీబీఎస్‌) సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు! గతంలో సర్కారు కొలువులంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. నోటిఫికేషన్‌ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకు వందల సంఖ్యలో దరఖాస్తులొస్తున్నాయి. వైద్యులకు ఉపాధి కరువవుతుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వైద్యుడంటే పొద్దంతా రోగులను చూసేందుకే సరిపోయేది. కాస్త ఎంగిలి పడేంత తీరిక కూడా ఉండేది కాదు. వైద్యుల పేరుతోనే ఆస్పత్రులు, క్లినిక్‌లు నడిచేవి. ఇప్పుడు వైద్యుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో పోటీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 1,32216 మంది డాక్టర్లున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మన దగ్గర కొత్తగా 32 వేల మంది వైద్యులు రాష్ట్ర వైద్యమండలిలో రిజిష్ట్రేషన్‌ చేసుకున్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యిమందికి ఒక వైద్యుడు ఉండాలి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. పెరుగుతున్న కాలేజీలు, సీట్ల పరంగా చూస్తే రాబోయే రోజుల్లో ఆ సంఖ్య మరింత తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిజేసే ఎంబీబీఎస్‌ వైద్యులకు కేవలం రూ.25-30 వేలే ఇస్తున్నారు. అది కూడా మనదగ్గర ఎంబీబీఎస్‌ చేసినవారికి. ఇక విదేశాల్లో వైద్యవిద్య చదివిన వారి పరిస్థితి మరీ దారుణం. అంత జీతం కూడా వారికివ్వడం లేదు. ఇక ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్‌ కోటాలో రూ.కోటి పెట్టి చదివించిన తల్లిదండ్రుల బాధ అయితే వర్ణణాతీతం. కోట్లు పోసినా... కనీసం వారి ఖర్చుల మందం కూడా సంపాదించుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇంకా చెప్పాలంటే నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందికి ఉన్న డిమాండ్‌ కూడా ఎంబీబీఎస్‌ వైద్యులకు లేకుండాపోతోందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ఇబ్బడిముబ్బడిగా సంఖ్య పెరుగుతుండటమే. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటులో కలపి 60 మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిలో 8,715 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇంకా కాలేజీల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాలేజీల సంఖ్యను పెంచుతున్నారే తప్ప వాటిలో తగినంత మంది అధ్యాపకులు ఉండటం లేదు. ఫలితంగా మెడికోలకు నాణ్యమైన వైద్యవిద్య అందడం లేదు. మరో నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో ఏటా పదివేలమందివరకు ఎంబీబీఎస్‌ చదవి బయటకొస్తారు. వారిలో ఉపాధి దొరికేది కొద్దిమందికే. మిగతా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమే.


పారామెడికల్‌ సిబ్బందికి ఉన్న డిమాండ్‌ డాక్టర్లకు లేదు

ప్రస్తుతం ఎంబీబీఎస్‌ డాక్టర్లకు అసలు డిమాండ్‌ లేదు. నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి ఉన్న డిమాండ్‌కూడా డాక్టర్లకు లేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలు కూడా ఇస్తున్నారు. ఇక డెంటల్‌ డాక్టర్లకు ఆ ఉద్యోగం కూడా దొరికే పరిస్థితి లేదు. నర్సుల కంటే తక్కువ వేతనంతో డాక్టర్లు పనిజేస్తున్నారు. భవిష్యత్తులో వైద్యవిద్య ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌లా మారే ప్రమాదం లేకపోలేదు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో పనిజేసే ఆర్‌ఎంపీలను ఎంబీబీఎస్‌ వైద్యులు రీప్లేస్‌ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

- డాక్టర్‌ భాగం కిషన్‌రావు,

అనస్థీషియా ప్రొఫెసర్‌, ఖమ్మం


క్యూబా పద్ధతి మేలు

మన రాష్ట్రంలో డాక్టర్ల డిమాండ్‌ కంటే సప్లయ్‌ ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఇది తీవ్ర నిరుద్యోగ సమస్యకు దారి తీస్తుంది. పెరిగిన కాలేజీల నేపథ్యంలో మనం దీన్ని ఆపలేం. ఇటువంటి పరిస్థితుల్లో క్యుబా దేశ విధానాన్ని మనం కూడా పాటించాలి. అక్కడ తయారయ్యే వైద్యులను ప్రపంచంలో వైద్యుల కొరత ఉన్న దేశాలను గుర్తించి పంపుతున్నారు. మన ప్రభుత్వం కూడా అదే పద్ధతిని పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక డాక్టర్‌ను తయారు చేయాలంటే ప్రభుత్వానికి ఏటా లక్షల్లో ఖర్చవుతుంది. లక్షలు పోసి తయారు చేసిన వారిని నిరుద్యోగులుగా ఉంచాలి. ఇతర చదువులు చదివిన వారు ఏదైనా పని, ఉద్యోగం చేయగలరు. కానీ వైద్యం చదివిన వారు వైద్యం తప్ప ఇతర పనులకు కూడా పనికిరారు. ఇది విషాదకరంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మన దేశంలో లక్షన్నరకు పైగా నిరుద్యోగ డాక్టర్లు ఉన్నారు.

-డాక్టర్‌ బీఎన్‌ రావు,

మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - Dec 12 , 2024 | 02:30 AM