Civil Services: సాఫ్ట్‌వేర్‌పై తగ్గిన క్రేజ్.. సివిల్స్‌పై మోజు!
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:21 AM
తెలుగు రాష్ట్రాల్లో ఏటా సివిల్స్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసినవారు సైతం సివిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఐటీ రంగంలో ఇబ్బందులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో అస్థిరత... అభ్యర్థులను సివిల్స్ వైపు వెళ్లేలా చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల
ఏటా 40 వేల మంది వరకు పరీక్షలకు హాజరు
మొత్తం పోస్టుల్లో 10ు తెలుగువారి సొంతం
హైదరాబాద్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఏటా సివిల్స్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసినవారు సైతం సివిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఐటీ రంగంలో ఇబ్బందులు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో అస్థిరత... అభ్యర్థులను సివిల్స్ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ రంగంలో కొంత మందగమనం నెలకొంది. దాంతో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు కూడా సరైన ఉద్యోగావకాశాలు లభించడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా నచ్చిన ప్యాకేజీ దక్కకపోవడం పాటు పని విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. మరోవైపు అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతుండడంతో బీటెక్ విద్యార్థుల ఆలోచనా సరళిలో మార్పు కనిపిస్తోందని సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 లక్షల మంది అభ్యర్థులు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో 5 నుంచి 6 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు రాసే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30-40 వేల మంది వరకు ఉంటున్నారు.
దేశంలో ఏటా వెయ్యి వరకు అఖిల భారత సర్వీసులో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10 శాతం అంటే సుమారు 100 పోస్టుల వరకు తెలుగువారు ఎంపికవుతున్నారు. వీటిలో కూడా 60 నుంచి 70 పోస్టులను తెలంగాణకు చెందిన అభ్యర్థులు పొందుతున్నారు. సివిల్స్‌కు తెలుగువారు ఎక్కువగా ఎంపిక కావడం కూడా అభ్యర్థుల ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. హైదరాబాద్‌లో నాణ్యమైన కోచింగ్ కేంద్రాలు ఉండడం కూడా అభ్యర్థులకు కలిసి వస్తోంది. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారిలో ఎక్కువ మంది 24 నుంచి 28 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. గతంలో సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూసే ధోరణి ఉండేది. ఎంపిక కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. అయితే ఇప్పటి అభ్యర్థుల ఆలోచన గతానికి భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సివిల్స్ సన్నద్ధమయ్యేందుకు ఒకటి లేదా రెండేళ్ల సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. ఎంపికయ్యే సామర్థ్యం ఉన్నట్టు భావిస్తే మరో ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఇతర ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. 30 ఏళ్లలోపే ఒక నిర్ణయానికి వస్తున్నారని, ఇది కూడా మంచి పరిణామమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సివిల్స్ విషయంలో గత ఐదారేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగువారిలో ఈ మార్పు గణనీయంగా కనిపిస్తోందని సివిల్స్ మెంటార్ బాలలత తెలిపారు.