సమయమొస్తే బీసీ పార్టీ: కృష్ణయ్య
ABN , Publish Date - Sep 23 , 2024 | 04:30 AM
బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం తెగించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): బీసీలందరూ ఏకతాటిపై నిలబడి జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు కోసం తెగించి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని అశోకా హోటల్‌లో అఖిలపక్ష బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచినా, ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేసే విధంగా చేస్తారని, కాబట్టి బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించి రాజ్యాంగ సవరణ చేస్తేనే శాశ్వతంగా లాభం ఉంటుందని తెలిపారు. చాలా మంది బీసీల పార్టీ పెట్టాలని కోరుతున్నారని, సమయమొస్తే తప్పకుండా పెడదామన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అవుతారని, 2028లో బీసీ సీఎం కాకపోతే మల్లన్న చచ్చినట్లేనన్నారు. రాష్ట్రంలో మిగిలివున్న 6 మంత్రి పదవులు బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీని కావడం వల్ల తనకు పార్టీలో అన్యాయం జరిగిందని వీహెచ్ వ్యాఖ్యానించారు.