కుటుంబాన్ని కబళించిన ప్రమాదం
ABN , Publish Date - Jan 15 , 2024 | 08:52 AM
మొక్కులు తీర్చుకొని ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబం ఇల్లు చేరలేదు. వారు ప్రయాణిస్తున్న ఆటో ఘోర ప్రమాదం బారినపడింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటో–కారు ఢీ.. నలుగురి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మొక్కులు తీర్చుకొని ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబం ఇల్లు చేరలేదు. వారు ప్రయాణిస్తున్న ఆటో ఘోర ప్రమాదం బారినపడింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆముతండాకు చెందిన ఇస్లావత్ శ్రీను (35)కు రుత్విక్ (6), రుత్విక (4) పిల్లలు. ఆయన భార్య గతంలోనే కొవిడ్‌తో మృతిచెందింది. శ్రీను ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీను, ఆయన తల్లి పాపా (60), ఇద్దరు పిల్లలు, అత్త శాంతి, బావమరిది సర్దార్‌తో కలిసి మొక్కులు చెల్లించుందుకు నల్లగొండ జిల్లాలోని బుడియాబాపు ఆలయానికి వెళ్లారు. శ్రీనునే ఆటో నడిపాడు. మొక్కులు తీర్చుకొని, రాత్రి అక్కడే బస చేసి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలోని వారు ఎగిరిపడ్డారు. ప్రమాదంలో ఆటో నడుపుతున్న శ్రీను, ఆయన తల్లి పాపా, శ్రీను కుమారుడు రుత్విక్, కుమార్తె రుత్విక మృతిచెందారు. శ్రీను అత్త శాంతి, బావమరిది సర్దార్ గాయపడ్డారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు.