Mohan Bhagwat: ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలి
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:14 AM
సమాజానికి ధర్మబద్ధమైన విజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారతదేశంలో ధర్మం విజ్ఞానభరితమైందని, మరి విజ్ఞానం ధర్మసమ్మతమా, కాదా అని ఆలోచించాలని సూచించారు.
ధర్మంతోనే అస్తిత్వం
ఏకత్వ భావన అవసరం
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
కొన్ని శక్తులు అభివృద్ధిని చూసి
తట్టుకోలేకపోతున్నాయి: కిషన్‌రెడ్డి
ముగిసిన లోక్‌మంథన్ భాగ్యనగర్
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమాజానికి ధర్మబద్ధమైన విజ్ఞానం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారతదేశంలో ధర్మం విజ్ఞానభరితమైందని, మరి విజ్ఞానం ధర్మసమ్మతమా, కాదా అని ఆలోచించాలని సూచించారు. ఆదివారం శిల్పకళా వేదికలో ‘లోక్‌మంథన్ భాగ్యనగర్ 2024’ ముగింపు కార్యక్రమంలో భాగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకం, సృష్టి, ధర్మం సనాతనమని, ఇవి కలిసే నడుస్తాయని, ప్రళయం వరకు ఉంటాయన్నారు. ఇవి కలిసి ఉంటేనే అస్తిత్వం కొనసాగుతుందన్నారు. ఏకత్వ భావన వుంటే అంతా మనదేనన్న భావన వస్తుందని చెప్పారు. మనం ధర్మం పేరుతో చాలా అధర్మాలు చేశామని, స్వార్థం పెరిగిపోయిందని, అందుకే దుర్బలులుగా మారిపోయామన్నారు. మనం సమాజాన్ని మనం సరిచేసే ప్రక్రియ కొనసాగకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కణాలు, జడత్వమని మాట్లాడారని, ఇప్పుడు చైతన్యమని అంటున్నారని భాగవత్ పేర్కొన్నారు. కానీ చైతన్యం అన్న అనుభూతి భారతీయుల వద్ద ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. దీన్ని మరిచిపోయామని, ఈ విస్మృతి నుంచి బయటపడాలని సూచించారు. అడవుల్లో ఉండే వనవాసీలు వాటికి ధర్మకర్తలని, వాటిని సంరక్షిస్తారని, ధర్మంగా వ్యవహరిస్తారని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మనదేశంలో వనవాసీల పట్ల పురాతనకాలం నుంచీ వివక్ష లేదన్నారు. తమిళనాడులో కొన్ని సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో వనవాసీలు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారని చెప్పారు. వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ అని అంటున్నా, మన మనసుల్లో మాత్రం భారతీయులమే అన్న భావన ఎప్పటి నుంచో ఉందన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం చైర్మన్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని విశ్వగురుగా నిలిపేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ఆధ్యాత్మికత పెంపొందడంతో పాటు అభివృద్ధిని కొన్ని శక్తులు సహించలేకపోతున్నాయన్నారు. అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశంలో కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతున్న తరుణంలో లోక్‌మంథన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ధర్మంగా.. తాత్వికంగా గెలిచాం
‘ధర్మంగా, తాత్వికంగా మనం గెలిచామ’ని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై భాగవత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నిన్న, మొన్న ఎన్నికలు జరిగాయి కదా అని ఆయన చమత్కరిస్తూ ఓటమిని జీర్ణించుకోలేనివారు విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేవుడి గురించి తెలిసిన వారు, తెలియని వారు కొంతమంది ఏళ్ల తరబడి పోరాటాలు చేసి అలసిపోయారని వ్యాఖ్యానించారు. ‘బయటి నుంచి ప్రశ్నించేవారికి సమాధానం ఇచ్చే ఆట మనకు వద్దు. అలాంటి వారికి మనమెందుకు జవాబివ్వాలి? వారి మైదానానికి వెళ్లి వారి నియమాలకు అనుగుణంగా మనమెందుకు కబడ్డీ ఆడాలి? మన మైదానంలోకి ప్రపంచాన్ని తీసుకురావాలి. ఇదీ మన లక్ష్యం’ అని భాగవత్ అన్నారు.
వైభవంగా ముగిసిన లోక్‌మంథన్
హైదరాబాద్ సిటీ: శిల్పారామంలో వైవిధ్యభరితమైన కళా ప్రదర్శనలతో నాలుగు రోజుల పాటు సాగిన లోక్‌మంథన్ ఆదివారం ముగిసింది. చివరిరోజు సంప్రదాయ వేదిక వద్ద తెలుగు రాష్ట్రాల కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యాంపీథియేటర్‌లో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. ఛత్తీ్‌సగఢ్ కళాకారులు 75కు పైగా వాయిద్యాలతో దేశభక్తి గీతాలు, జానపద గేయాలను ఆలపించారు.