Share News

Rural Health Services: పల్లెల్లో అరకొర వైద్యం

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:52 AM

మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని తేలింది. పల్లె ప్రజలకు వైద్యులు పెద్దగా అందుబాటులో లేరని వెల్లడైంది.

Rural Health Services: పల్లెల్లో అరకొర వైద్యం

  • గ్రామాల్లో ఆస్పత్రులు, డాక్టర్లకు కొరత

  • వైద్య సిబ్బంది సంఖ్య కూడా అంతంతే

  • జనాభాకు తగ్గట్లుగా లేని దవాఖానాలు

  • రూరల్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌లో కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని తేలింది. పల్లె ప్రజలకు వైద్యులు పెద్దగా అందుబాటులో లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న వైద్య సేవల వివరాలపై కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ‘హెల్త్‌ డైనమిక్‌ ఆఫ్‌ ఇండియా 2022-23’ వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. దీనినే రూరల్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌గా పిలుస్తారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) 63 శాతం మంది వైద్యులే పనిచేసున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) 52 శాతమే స్పెషాలిటీ వైద్యులున్నారు. అలాగే జనాభాకు తగినట్లుగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లు లేవు.


  • రూరల్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌లోని ముఖ్యాంశాలు

  • తెలంగాణలో 11,226 గ్రామాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 4,228 సబ్‌ సెంటర్లు ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 712 ఉన్నాయి. పల్లెల్లో 594 పీహెచ్‌సీలు ఉండగా అందులో 757 మంది డాక్టర్లు, 1,134 మంది నర్స్‌లు పనిచేస్తున్నారు. పట్టణాల్లోని 275 పీహెచ్‌సీల్లో 299 మంది వైద్యులు, 517 మంది నర్స్‌లు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 29 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 57 ఉన్నాయి. 42 సబ్‌ డివిజిన్‌ ఆస్పత్రులు, 6 జిల్లా ఆస్పత్రులు, 9 వైద్య కళాశాలలు ఉన్నాయి.

  • గ్రామీణ ప్రాంతాల్లోని 594 పీహెచ్‌సీల్లో 1,188 మంది వైద్యులుండాలి. కానీ 757 మందే ఉన్నారు. 431 ఖాళీలున్నాయి. 29 సీహెచ్‌సీల్లో 116 మంది స్పెషలిస్టు వైద్యులు అవసరం ఉండగా.. 61 పోస్టులనే మంజూరు చేశారు. ఉన్న వాటిలో ప్రస్తుతం 37 మందే పనిచేస్తున్నారు. 79 ఖాళీలున్నాయి. ఒక్కో సీహెచ్‌సీలో ఒక రేడియోగ్రాఫర్‌ అవసరం ఉండగా.. 18 ఖాళీలున్నాయి. 683 ఫార్మసిస్ట్‌ శాంక్షన్డ్‌ పోస్టులకు 523 మందే పనిచేస్తున్నారు. 159 ఖాళీలున్నాయి. ల్యాబ్‌టెక్నిషీయన్‌ పోస్టులు 677 ఉండగా.. 461 మందే పనిచేస్తున్నారు. 216 ఖాళీలున్నాయి. స్టాఫ్‌నర్స్‌ పోస్టులు 1,739 ఉండగా.. 1,377 మందే సేవలందిస్తున్నారు.

  • రాష్ట్రంలో 2022లో 578 పీహెచ్‌సీలుండగా.. 2023 నాటికి అవి 594కు పెరిగాయి. 2022లో 802 మంది డాక్టర్లు ఉండగా.. గతేడాది ఆ సంఖ్య 757కు తగ్గింది. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టుల సంఖ్య 98 నుంచి 37కు పడిపోయింది. జాతీయ స్థాయిలో పల్లె పీహెచ్‌సీల్లో పని చేసే వైద్యుల సంఖ్య 30,640 నుంచి 32,901కు పెరిగింది..

  • తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 2023 నాటికి సుమారు 2.70 కోట్ల మంది ఉంటారని అంచనా. ఆ మేరకు 708 పీహెచ్‌సీలు అవసరం కాగా, 114 కేంద్రాల కొరత ఉంది. 177 సామాజిక ఆరోగ్య కేంద్రాలు అవసరం కాగా, 29 ఉన్నాయి.

  • గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో 427 శాంక్షన్డ్‌ ఏఎన్‌ఎమ్‌ పోస్టులుండగా.. 167 మందే పనిచేస్తున్నారు. 1,188 శాంక్షన్డ్‌ డాక్టర్‌ పోస్టులకు గాను 757 మందే పనిచేస్తున్నారు. 431 ఖాళీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్‌ వైద్యులు 871 మంది అవసరం కాగా 659 మందే ఉన్నారు.

  • రాష్ట్రంలోని 4,228 సబ్‌ సెంటర్లలో 2216 మంది ఏఎన్‌ఎమ్‌లు పనిచేస్తున్నారు. 52 శాతం మేర కొరత ఉంది.

  • తెలంగాణలో ప్రతీ 4,705 మందికి ఒక సబ్‌సెంటర్‌ ఉంది. కేరళలో ఆ సంఖ్య 719గా ఉంది. అలాగే మన రాష్ట్రంలో ప్రతీ 33,488 మందికి ఒక పీహెచ్‌సీ.. ప్రతీ 6,85,931 మందికి ఒక సీహెచ్‌సీ ఉంది. దేశంలోనే అత్యధిక జనాభాకు ఒక సీహెచ్‌సీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వాస్తవానికి అతితక్కువ జనాభాకు ఒక సీహెచ్‌సీ ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడ ప్రతీ 40,720 మందికి ఒక సీహెచ్‌సీ ఉంది.

Updated Date - Sep 10 , 2024 | 04:36 AM