Sangareddy: గిర్మాపూర్ గురుకుల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:34 AM
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు టీచర్లపై చర్యలు
కొండాపూర్, జగిత్యాల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘కుళ్లిన కూరగాయలు- అన్నంలో పురుగులు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ మాధురి సోమవారం పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, పారిశుధ్య లోపంతోపాటు సమస్యలు పరిష్కరించడంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నివేదిక ఇచ్చారు.
ఈ మేరకు ప్రిన్సిపాల్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటూ కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొడిమ్యాల మండలం చెప్యాల్ జడ్పీహెచ్‌ఎ్‌సలో మధ్యాహ్న భోజనం అమలుపై ప్రత్యేకాధికారులు తనిఖీలు చేసి నివేదికను కలెక్టర్ అందజేశారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్కూల్ అసిస్టెంట్ వి వెంకటరమణ రావును సస్పెండ్ చేయడంతో పాటు ఎం ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామికి మెమో జారీ చేశారు. అలాగే మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ఫుడ్ ఇన్‌చార్జి సీహెచ్ కిషోర్‌ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ మాధవీలతకు మెమో జారీ చేశారు.