మొన్న పూవర్తి.. నేడు కొండపల్లి
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:28 AM
ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.
నక్సల్స్ అడ్డాలో మరో పోలీస్ క్యాంప్
స్తూపాల కూల్చివేత.. మొదలైన కూబింగ్
5 వేల మంది పోలీసులతో పూవర్తి అడవులు జల్లెడ
చర్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మొదటి బెటాలియన్ సీఎల్‌జీఏ కమాండర్ మాద్వి హిడ్మా సొంతూరు బీజాపూర్ జిల్లాలోని పూవర్తిని ఇప్పటికే అధీనంలోకి సీఆర్‌పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశాయి. సుమారు 5వేల మంది కేంద్ర బలగాలు పూవర్తి అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇటు మావోయిస్టుల సంచారం అధికంగా ఉండే కొండపల్లి గ్రామంలోనూ గురువారం సీఆర్‌పీఎఫ్ పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, మహిళా కమాండోలు రంగంలోకి దిగారు. కొండపల్లిని అధీనంలోకి తీసుకుని.. అక్కడి భారీ స్తూపాలను కూల్చివేశారు.
గతంలో చనిపోయిన మావోయిస్టుల ముఖ్య నేతల స్మారకార్థం పదేళ్ల కింద మావోయిస్టులు ఈ స్తూపాలను నిర్మించారు. వీటి వద్దే మావోయిస్టుల సమావేశాలు జరుగుతుండేవని.. ఇవి 30, 20 అడుగుల ఎత్తు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొండపల్లి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపల్లిలో క్యాంప్ ఏర్పాటుపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వేల మంది పోలీసులు కొండపల్లిలో మకాం వేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. వెరసి.. అడవుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో పూవర్తి, గుండం, ధర్మారంలో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేస్తుండగా మావోయిస్టులు దాడులు చేసిన ఘటనలున్నాయి.