Share News

Seethakka: పాఠ్యాంశంగా మహిళల గౌరవం..

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:07 AM

అన్ని స్థాయిల్లో మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని.. మహిళలను సెక్స్‌ సింబల్‌గా, వ్యాపార వస్తువుగా చూసే విధానం పోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: పాఠ్యాంశంగా మహిళల గౌరవం..

  • నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తాం.. ప్రభుత్వాస్పత్రిలో వైద్యురాలికే రక్షణ లేకపోతే ఎలా?

  • అఘాయిత్యాలకు గంజాయి వ్యసనమూ కారణమే

  • మానవ అక్రమ రవాణా నివారణ సదస్సులో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): అన్ని స్థాయిల్లో మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని.. మహిళలను సెక్స్‌ సింబల్‌గా, వ్యాపార వస్తువుగా చూసే విధానం పోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనను గుర్తుచేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలికే భద్రత లేకపోతే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.


మగవారి ఆలోచనా విధానంలో మార్పులు వస్తేనే.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని, మహిళలను గౌరవించాలంటూ తమ పిల్లలకు తల్లిదండ్రులను నేర్పించాలని, లింగ బేధం లేకుండా అమ్మాయి, అబ్బాయిలను సమానంగా పెంచాలని సూచించారు. మహిళలను గౌరవించడం (హౌ టు రెస్పెక్ట్‌ ఉమెన్‌) అనే అంశమ్మీద ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని రూపొందించి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.


నేరం జరగకముందే ఆ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సీతక్క పాల్గొని మాట్లాడారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు సత్వర న్యాయం చేయడంతో పాటు, నిందితులకు త్వరగా శిక్షపడేలా వ్యవస్థలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. మహిళలలు, చిన్నారులు మీద జరుగుతున్న అఘాయిత్యాలకు గంజాయి వ్యసనం కూడా కారణంగా కనిపిస్తోందన్నారు. ఆ మహామ్మారి నుంచి సమాజాన్ని బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పారు.


  • అంగన్‌వాడీలను సీఎం సందర్శిస్తారు

రాష్ట్రంలోని అంగన్‌వాడీలు దేశానికి ఆదర్శంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీతక్క సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలుంటాయని, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా సందర్శిస్తారని తెలిపారు. సెప్టెంబరు 4 నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని.. పథకాలు, పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు.


గురువారం సచివాలయంలో అన్ని జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అంగన్‌వాడీల ద్వారా అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాలని, చిన్నారులకు ఇస్తున్న ఉడకబెట్టిన కోడిగుడ్డును రెండు ముక్కలుగా చేసి అందించాలని సూచించారు.

Updated Date - Aug 30 , 2024 | 04:07 AM