Share News

Nagarkurnool: తన ఎదుట స్టయిల్‌గా తలదువ్వారని.. ముగ్గురికి ఎస్సై శిరోముండనం

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:59 AM

విచారణకు అని పిలిస్తే తన ఎదుట స్టయిల్‌గా తల దువ్వుతూ పోజిచ్చారనే ఆగ్రహంతో ఓ ఎస్సై, ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు.

Nagarkurnool: తన ఎదుట స్టయిల్‌గా తలదువ్వారని.. ముగ్గురికి ఎస్సై శిరోముండనం

  • అచ్చంపేట నియోజకవర్గం లింగాలలో ఘటన

  • అవమానంతో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

  • పరిస్థితి విషమం.. మావాడికేదైనా జరిగితే ఎస్సైదే బాధ్యత

  • ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

నాగర్‌కర్నూల్‌, నాగర్‌కర్నూల్‌ క్రైం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విచారణకు అని పిలిస్తే తన ఎదుట స్టయిల్‌గా తల దువ్వుతూ పోజిచ్చారనే ఆగ్రహంతో ఓ ఎస్సై, ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు. గుండుతో ఇంటికొచ్చిన కుమారుడిని ప్రశ్నించిన తల్లిదండ్రులు విషయం తెలిసి, కొడుకునే మందలించడంతో అతడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లింగాలకు చెందిన అఖిల్‌, నిఖిల్‌, వినీత్‌ 13న రాత్రి ఓ పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి రూ.20 పెట్రోల్‌ వేయాలని బంక్‌ సిబ్బందిని కోరారు.


అంత చిన్న మొత్తానికి పెట్రోలు పోయలేమని వారు చెప్పడంతో ఘర్షణ జరిగింది. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో లింగాల పోలీసులు ఆ ముగ్గురు యువకులను స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై జగన్‌ సమక్షంలో ముగ్గురు యువకులు స్టయిల్‌గా తల దువ్వడంతో ఆగ్రహానికి గురైన ఎస్సై స్టేషన్‌లోనే ఈ ముగ్గురికి శిరోముండనం చేయించి వదిలిపెట్టారు. ముగ్గురిలో వినీత్‌ ఇంటికి వెళ్లగా.. ఎందుకు గుండు గీయించుకున్నావని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావంటూ మందలించారు. మనస్తాపం చెందిన వినీత్‌ ఉరివేసుకున్నాడు.


కుటుంబసభ్యులు అతడిని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కాగా, 4 రోజుల నుంచి లింగాల ఎస్సై అందుబాటులో లేరు. మరోవైపు... ముగ్గురు యువకులను స్టేషన్‌కు రప్పించిన పోలీసులు వారితో 3 రోజుల పాటు స్టేషన్‌లోనే వివిధ రకాల పనులు చేయించి, ఇబ్బందులకు గురిచేసినట్లు వినీత్‌ ద్వారా తెలిసింది. కాగా, తమ కొడుకుకు ఏమైనా జరిగితే ఎస్సై జగనే బాధ్యత వహించాలని వినీత్‌ తల్లి లక్ష్మి తండ్రి సుధాకర్‌ చెప్పారు. తమ కొడుకుకు శిరోముండనం చేసేంత తప్పు ఏం చేశాడని వారు ప్రశ్నించారు. తమ పరువును బజారుకీడ్చి తమ కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారకుడైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 20 , 2024 | 03:59 AM