Singareni: 4న సీఎం చేతుల మీదుగా 593 మందికి నియామక పత్రాలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 03:33 AM
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను’ సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు.
సింగరేణిలో ప్రజా విజయోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
అధికారులతో ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక సమీక్ష
హైదరాబాద్/ కొత్తగూడెం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను’ సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లిలో జరిగే యువశక్తి సభలో సింగరేణికి సంబంధించి 593 మందికి నియామక పత్రాలు సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇవ్వడానికి అవసర మైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. శనివారం ఆయన ప్రజా విజయోత్సవాల నిర్వహణపై హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఏడాది కాలంలో 2,165 కొత్త ఉద్యోగాలను సింగరేణిలో కల్పించినట్లు చెప్పారు. సింగరేణికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని స్కాన్ చేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో తెలుసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఆయన ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ ఇన్‌లలో సింగరేణికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని సీఎండీ బలరామ్ చెప్పారు.