Share News

National Award: సింగరేణికి ఎనర్షియా ఫౌండేషన్‌ అవార్డు

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:46 AM

పర్యావరణహిత సుస్థిర మైనింగ్‌తో పాటు సంప్రదాయేతర విద్యుత్‌రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

National Award: సింగరేణికి ఎనర్షియా ఫౌండేషన్‌ అవార్డు

  • పర్యావరణహిత మైనింగ్‌, సోలార్‌ వినియోగంలో గుర్తింపు

  • 20న విశాఖపట్నంలో ప్రదానం చేయనున్న నిర్వాహకులు

కొత్తగూడెం, జైపూర్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత సుస్థిర మైనింగ్‌తో పాటు సంప్రదాయేతర విద్యుత్‌రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది ‘‘ఇండియస్‌ బెస్ట్‌ అండ్‌ మోస్ట్‌ సస్టెయినబుల్‌ కోల్‌మైనింగ్‌ ఆపరేటర్‌ విత్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ అడాప్షన్‌’’ క్యాటగిరీలో సింగరేణిని ‘ఎనర్షియా ఫౌండేషన్‌’ అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేసింది. ఈ నెల 20న విశాఖపట్నంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఒడిశాలో నైనీ బొగ్గుగనికి అనుబంధంగా పర్యావరణహితంగా 1600 మెగావాట్ల అత్యాధునిక సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ను చేపట్టే ప్రతిపాదన, రామగుండంలో 500 మెగావాట్ల పంప్‌స్టోరేజీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధం కావడం, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటం, కార్బన్‌ డైయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీ తదితర చర్యలతో సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు అవార్డు కమిటీ జ్యూరీ కన్వీనర్‌ ఆర్‌. త్యాగరాజన్‌ అయ్యర్‌ తెలిపారు. సింగరేణి సంస్థ 6 కోట్లకు పైగా మొక్కలు నాటడమే కాక వాటిని వనాలుగా పెంచుతోందన్నారు.


సింగరేణి పర్యావరణహిత చర్యలకు గుర్తింపు

సింగరేణి సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం సంతోషకరమని సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. బలరాం తెలిపారు. కరీంనగర్‌ జిల్లా శ్రీరాంపూర్‌లోని థర్మల్‌ విద్యుత్‌కేంద్రంలో, మంచిర్యాల జిల్లా జైపూర్‌ ఎన్‌టీపీపీలో ఆయన మొక్కలు నాటారు. బలరాం ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లోని 40 ప్రదేశాల్లో 18,500 మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్ర సృష్టించారు.

Updated Date - Dec 16 , 2024 | 05:46 AM