Hyderabad: 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:56 AM
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 66 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు
పండుగల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు: దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా 66 జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఉన్న రెండు కోచ్‌లు కాకుండా రైళ్లకు మరో రెండు అదనపు జనరల్ క్లాస్ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ, గుంటూరు, నిజాముద్దీన్, తిరుపతి, కాకినాడ, మచిలీపట్నం, యశ్వంతపూర్, నాందేడ్, మదురై తదితర మార్గాలకు వెళ్లి వచ్చే రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. త్వరలో మరో 21 రైళ్లకు 80 అదనపు కోచ్‌లను జత చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, సికింద్రాబాద్ నుంచి బ్రహ్మాపూర్, విశాఖపట్నం మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కిస్మస్ పండుగ నేపథ్యంలో డిసెంబరు 6 నుంచి 30 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.