Share News

Telangana: సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో హిమ శిఖరం

ABN , Publish Date - May 27 , 2024 | 03:38 AM

‘ఆచార్య రవ్వా శ్రీహరికి వ్యాకరణం, నిఘంటు నిర్మాణం రెండు కళ్లు. కనుకనే ఆ మహామహోపాధ్యాయుని స్మారక జీవన సాఫల్య పురస్కారాలను సంస్కృత భాషా సాహిత్య పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఆచార్య శలాక రఘునాథశర్మకు, తెలంగాణ పదకోశ రూపకర్త నలిమెల భాస్కర్‌కు ఇవ్వడం ముదావహమ’ని వక్తలు కొనియాడారు.

Telangana: సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో హిమ శిఖరం

  • ఆచార్య రవ్వా శ్రీహరి సేవలను గుర్తుచేసుకొన్న వక్తలు

  • ఆచార్య శలాక రఘునాథశర్మ, నలిమెల భాస్కర్‌కు

  • రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘ఆచార్య రవ్వా శ్రీహరికి వ్యాకరణం, నిఘంటు నిర్మాణం రెండు కళ్లు. కనుకనే ఆ మహామహోపాధ్యాయుని స్మారక జీవన సాఫల్య పురస్కారాలను సంస్కృత భాషా సాహిత్య పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన ఆచార్య శలాక రఘునాథశర్మకు, తెలంగాణ పదకోశ రూపకర్త నలిమెల భాస్కర్‌కు ఇవ్వడం ముదావహమ’ని వక్తలు కొనియాడారు.

పాణినీయ ‘అష్టాధ్యాయి’ సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని 2 వేల పేజీల్లో తెలుగులోకి అనువదించి న మహాపండితుడు శ్రీహరి అంటూ సంస్కృతాంధ్ర భాషలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకొన్నారు. ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. తూము రామదాసు కవి పద్య నిఘంటువుకు తత్సమేతర శబ్దాలతో రవ్వా శ్రీహరి కూర్చిన అచ్చతెలుగు పర్యాయపద నిఘంటువు ‘ఆంధ్రపద నిధానం’ను వక్తలు ఆవిష్కరించారు.

ముఖ్య అతిథిగా హాజరైన పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. సంస్కృత కావ్యాలను తెనుగీకరించడం సాధారణమని, అందుకు భిన్నంగా తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి అనువదించిన గొప్ప పండితుడు రవ్వా శ్రీహరి అని కొనియాడారు.


అముద్రితంగా ఉన్న రవ్వా శ్రీహరి నిర్మించిన ఈ ఏడో నిఘంటువును ఆయన మరణానంతరం ప్రచురించిన ఆయన ముగ్గు రు కుమారులను అభినందించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సంస్కృత వ్యాకరణవేత్త అయిన రవ్వా శ్రీహరి సాహిత్య సృజనలో అట్టడుగు ప్రజల భాషకూ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. స్థానిక ప్రాంతీయ అభివ్యక్తి ఆయన కృషిలో కనిపిస్తుందన్నారు.

ఈ కార్య క్రమానికి తెలుగు అకాడమీ పూర్వ సంచాలకుడు కె.యాదగిరి సభాధ్యక్షత వహించారు. ప్రముఖ సాహిత్య పరిశోధకుడు శ్రీరంగాచార్య, విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు వెల్చాల కొండలరావు, సంస్కృత పండితులు ఆచార్య ఏ.రాములు, భాగవతం రామారావు, సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ పిల్లలమర్రి రాములు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పరిషత్‌ కార్యదర్శి అప్పంపాండయ్య, రవ్వా శ్రీహరి భార్య అనంతలక్ష్మి, కుమారుడు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 03:51 AM