Hussain Sagar: నింగి తనవైపు లాక్కున్నట్టు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:40 AM
ఒక విమనానికి మరో విమానం తాకుతుందేమో అన్నట్టుగా అత్యంత సమీపంలో తొమ్మిది విమానాలు గాల్లో వరుసగా ఎగురుతుంటే?
ఎయిర్ షో అద్భుతం
9 విమానాలు.. అరగంట పైగా విన్యాసాలు
మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్
షోను ప్రారంభించి, మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అల్వాల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఒక విమనానికి మరో విమానం తాకుతుందేమో అన్నట్టుగా అత్యంత సమీపంలో తొమ్మిది విమానాలు గాల్లో వరుసగా ఎగురుతుంటే? పైగా రేఖామాత్రంగానైనా దూరంగా జరగకుండా ఆదే సామిప్యతను కొనసాగిస్తూ ఒక్కసారిగా అన్నీ నేలను తాకుతాయేమో అన్నట్టుగా కిందకు దూసుకొచ్చి.. మళ్లీ గాల్లోకి లేస్తే? అదే వేగంతో రౌండ్ రౌండ్‌గా చక్కర్లు కొడితే? ఇదంతా మన కళ్ల ముందే జరిగితే? అదెంతత గొప్ప అనుభూతో కదా! ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం హుస్సేన్‌సాగర తీరాన నిర్వహించిన ‘ఎయిర్ షో’ను చూసి జనం కాసేపు తమను తామే మరిచిపోయారు. కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఎయిర్‌షోను ప్రారంభించి, వీక్షించారు. అరగంటకు పైగా సాగిన ఎయిర్ షోలో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి బృందానికి చెందిన తొమ్మిది హాక్ ఎంకే 132 విమానాలు చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. ఆదివారం కావడంతో వీక్షించేందుకు వచ్చిన జనంతో హుస్సేన్‌సాగర్, నెక్ల్‌సరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎయిర్‌షో భాగంగా విమానాలు త్రివర్ణ పతాకంలోని రంగులను విరజిమ్మాయి! ఒక్కసారిగా నింగి మూడు రంగుల జెండా రూపును సంతకరించుకోవడంతో వీక్షకుల మనసు దేశభక్తితో ఉప్పొంగి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు! విన్యాసాల్లో భాగంగా రెండు విమానాలు ప్రేమ చిహాన్ని (లవ్ సింబల్) వేయగా మరో విమానం బాణం గుర్తుతో మధ్యలోంచి దూసుకెళ్లడంతో వీక్షకులు ఈలలు వేశారు. ఎయిర్‌షో నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బృందానికి రేవంత్ అభినందనలు తెలిపారు.
అలరించిన జానపదాలు, స్కిట్లు!
ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, కళలు.. ఆధునిక నృత్యరీతులను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సచివాలయం, ఐమాక్స్ థియేటర్, నెక్ల్‌సరోడ్డు వద్ద మూడు పెద్ద వేదికల్లో ఈ ప్రదర్శనలు సాగాయి. తెలంగాణ జానపదాలు, చిందుగానం, బోనాలు, భరతనాట్యం, పేరిణి నృత్యం, డ్రామాలు, స్కిట్లు, సినిమా పాటల ప్రదర్శన వీక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. వడ్డె శంకర్ జానపద గీతాలు, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి వేదికపైకి వెళ్లి కళాకారులను అభినందించారు. అలాగే ప్రముఖ హోటళ్ల యజమానులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. పిస్తాహౌజ్, ప్యారడైజ్, నిలోఫర్, ఇందిరా మహిళశక్తి క్యాంటీన్ల నిర్వాహకులతో మాట్లాడారు.
నెక్లెస్ రోడ్డులో ‘హానర్ రన్’
దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళిగా, సాయుధ దళాలకు మద్దతుగా నిలబడేందుకు భారత సైన్యం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఆదివారం ‘హానర్ రన్’ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను 12.5 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ, 4 కి.మీ రూపంలో వేర్వేరుగా నిర్వహించారు. మొత్తంగా 1200 మంది రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్ పాల్గొన్నారు. సీనియర్ మిలటరీ అధికారులతో పాటు వెటరన్స్‌తో కలిసి పౌరులు ఈ రన్‌లో పాల్గొన్నారు.
వాయుేసన సేవలు స్ఫూర్తిదాయకం:ఉత్తమ్
దేశ సరిహద్దుల్లో భారత వాయుేసన అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో వాయుసేన పాత్ర స్ఫూర్తి దాయకమని అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద వైమానిక విన్యాసాలు చేసిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి తాను వాయుేసనలో యుద్ధ విమాన పైలెట్‌గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో మిగ్-21,మిగ్ 23 వంటి అడ్వాన్స్డ్ యుద్ద విమానాలను నడుపుతూ దేశభద్రతకు పని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. వాయుేసనకు సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం గర్వకారణమని కొనియాడారు.