Share News

Sarpanch Elections: గ్రామాల్లో ‘స్థానిక’ జోష్‌

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:02 AM

‘‘సర్పంచ్‌ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో అంటున్నారు.. నిజమేనా.! బీసీలకు రిజర్వేషన్లను పెంచుతారా? ఈసారి మన ఊరు సర్పంచ్‌గిరీ ఎవరికి వస్తదో!’’ ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో రచ్చబండల దగ్గర జరుగుతున్న చర్చ ఇది.

Sarpanch Elections: గ్రామాల్లో ‘స్థానిక’ జోష్‌

  • సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చ

  • జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలంటూ ప్రచారం

  • ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రాజకీయ పార్టీలు

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘సర్పంచ్‌ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరిలో అంటున్నారు.. నిజమేనా.! బీసీలకు రిజర్వేషన్లను పెంచుతారా? ఈసారి మన ఊరు సర్పంచ్‌గిరీ ఎవరికి వస్తదో!’’ ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో రచ్చబండల దగ్గర జరుగుతున్న చర్చ ఇది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా ఇదే చర్చ. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా ‘‘ఎన్నికలు ఎప్పుడంటున్నారు?’’ అనే ప్రశ్నతోనే సంభాషణలు మొదలవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పునకు సంబంధించి కూడా విస్తృత చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు మారితే తమ గ్రామాల్లో సర్పంచ్‌గా, మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీగా ఏ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందనే దానిపైనా బేరీజు వేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా స్థానికంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం గ్రామం, మండల స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీల వారీగా ఎవరి వర్గాలను వారు బలోపేతం చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలపైనా ప్రత్యేక దృష్టి పెడుతూ.. ప్రస్తుతం జాబితాలో ఎవరెవరు ఉన్నారు? ఎన్నికల నాటికి కొత్తగా ఓటు హక్కు వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అనేదానిపై గ్రామాల్లో తూర్పార పడుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సంక్రాంతి కంటే ముందే స్థానిక జోష్‌ మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. క్షేత్రస్థాయిలోనూ ఇదే తంతు మొదలైంది. ప్రభుత్వం అమలుచేసిన రుణమాఫీ పథకం అందరికీ అందలేదని, స్థానిక ఎన్నికల కోసమే సంక్రాంతి నుంచి రైతు భరోసా, కూలీలకు రూ.12వేల సాయం అందిస్తామంటున్నారని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీల నడుమ మాటల మంటలు రాజుకుంటున్నాయి.


రిజర్వేషన్ల మార్పుపై ఆసక్తి..

తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి 9నెలలు అవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయి 7నెలలు అవుతోంది. వాస్తవానికి ఆయా పదవుల కాలం అయిపోయేనాటికే ఎన్నికలు జరిగి కొత్తవారు ఎన్నిక కావాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరగడంతో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42శాతం పెంచుతామంటూ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిషన్‌(బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌) బీసీల రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించనుంది. అనంతరం రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కులానికి ఎంత రిజర్వేషన్‌ కేటాయించినా.. అన్నీ కలిపి 50శాతానికి మించకూడదు. దాంతో ఈసారి స్థానిక ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం వారికి ఎంత మేర అవకాశాలు లభించనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Dec 26 , 2024 | 05:02 AM