Lagacherla: కుట్ర పూరితంగానే లగచర్ల దాడులు
ABN , Publish Date - Nov 14 , 2024 | 03:56 AM
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
కుట్రదారులను విడిచిపెట్టేది లేదు
మంత్రులు దుద్దిళ్ల, దామోదర
దాడిలో గాయపడ్డ ‘కడా’ ప్రత్యేకాధికారికి పరామర్శ
చంపాపేట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై లగచర్లలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కుట్రపూరితంగా దాడులు చేశారని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడిలో గాయపడిన కొడంగల్ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి కె.వెంకట్‌రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌లోని ఆర్‌కేఆర్ ఎన్‌క్లేవ్ కాలనీలోని వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రులు.. ఆయన కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, ప్రభుత్వ పరంగా వారు ప్రజల విజ్ఞప్తులను తెలుసుకునేందుకు వెళ్తే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలన్నారు.
కలెక్టర్ సహా అధికారులందరినీ గ్రామంలోకి తీసుకెళ్లి కుట్ర కోణంతోనే స్పష్టంగా దాడులకు పాల్పడినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కూడా అర్థమైందన్నారు. దాడులకు పురమాహించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అమాయకులు, సామాన్యులపై కేసులు ఉండవని.. సీఎం ఇదివరకే ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. మంత్రి దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్ గత పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉందని, ఏనాడు అధికారులపై దాడులు, హింసకు పాల్పడకుండా నిరసనలు తెలిపామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రోత్సాహంతోనే ఇది జరిగిందన్నారు. ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రుల వెంట చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, ఇతర నేతలున్నారు.