Share News

Sridhar Babu: ‘మూసీ’పై విపక్షాలది రాద్ధాంతం

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:10 AM

మూసీ కూల్చివేతలపై పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ‘మూసీ’పై విపక్షాలది రాద్ధాంతం

  • కూల్చివేతలపై లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు

  • టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తికి కేంద్రం సహకరించాలి

  • సెమీ కండక్టర్‌ మిషన్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలి

  • మీడియాతో ఇష్ఠాగోష్టిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

న్యూఢిల్లీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మూసీ కూల్చివేతలపై పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అధికారుల అత్యుత్సహం వల్ల కొంతమంది పేదలకు అన్యాయం జరిగితే ప్రభుత్వంపై చెడు ప్రచారం చేస్తున్నారని, కూల్చివేతలపై ప్రజలలో ప్రతిపక్షాలు లేనిపోని భయాలు సృష్టిస్తున్నాయన్నారు. హైడ్రాతో పెద్దల ఆక్రమణలను కూలగొడితే అందరూ హర్షం వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మూసీ కూల్చివేతలు ప్రస్తుతం నెమ్మదించినప్పటికీ కొనసాగుతాయన్నారు.


కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా దారుణంగా వ్యవహరించిందని, పాత ఆడియోలను వైరల్‌ చేయడం సరికాదని ఆయన సూచించారు. వివాదంపై కొండా సురేఖ విచారం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. త్వరలో విద్యుత్‌ పాలసీలో సంస్కరణలు తీసుకొస్తామని, గ్రీన్‌ ఎనర్జీకి పెద్దపీట వేస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను పూర్తి చేయాలంటే కేంద్రం సహకారం అందించాలని కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు విజ్ఞప్తి చేశామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.


రూ.1600 కోట్ల మేర నిధులు అవసరమని తక్షణమే ఆ నిధులను రాష్ట్రానికి విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు. రూ.3 వేల కోట్ల రాష్ట్రప్రభుత్వ నిధులతో అండర్‌గ్రౌండ్‌ ద్వారా ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతాలలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖా అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఐటీ మంత్రుల కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు. ఇండియన్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ కింద అడ్వాన్స్‌డ్‌ ప్యాకేజింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్స్‌, అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌ యూనిట్లను తెలంగాణలో స్థాపించాలని మంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు.

Updated Date - Oct 17 , 2024 | 03:10 AM