CM Revanth Reddy: విలువల కొలువుగా బాపూఘాట్
ABN , Publish Date - Nov 02 , 2024 | 05:58 AM
మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చి దిద్ది ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలపై అధికారులు చర్చలను ప్రారంభించారు.
మహాత్ముని సిద్ధాంతాలు, నైతికతపై బోధన..
ప్రపంచంలో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు
మూసీ, ఈసీ సంగమంలో సరోవరం నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
విస్తృతంగా చర్చలు
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మూసీ తీరంలోని బాపూఘాట్‌ను అద్భుతంగా తీర్చి దిద్ది ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనాలపై అధికారులు చర్చలను ప్రారంభించారు. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కల్పించాల్సిన ఇతర ఆకర్షణలపైనా సమాలోచనలు జరుగుతున్నాయి. ఈసీ, మూసీ నదుల సంగం ప్రాంతంలో బాపూఘాట్ ఉండడంతో అక్కడ బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు.
దానికి గాంధీ సరోవర్ అన్న పేరు పెట్టనున్నారు. గాంధీ భావజాల కేంద్రం(గాంధీ ఐడియాలజీ సెంటర్)ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్థి చేయాలని ప్రతిపాదించారు. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, నైతిక విలువల కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాపూఘాట్‌లో ఏర్పాటు చేసే మహాత్మాగాంధీ విగ్రహం ఎలా ఉండాలనేదానిపై ఆయా రంగాల నిపుణుల నుంచి అధికారులు సూచనలను స్వీకరించనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న గాంధీ విగ్రహాలు, ఆశ్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2013లో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న విగ్రహమే ప్రస్తుతం దేశంలో అత్యంత ఎత్తయినది.
కాంస్యంతో తయారు చేసిన దీని ఎత్తు 72 అడుగులు. ఇద్దరు చిన్నారులతో గాంధీ అప్యాయంగా ఉన్నట్లుగా ఈ విగ్రహం ఉంటుంది. అమెరికాలోని టెక్సా్‌సలో ఉన్న ఇర్వింగ్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద దండియాత్రకు నడుస్తున్న భంగిమలో 8 అడుగుల కాంస్య విగ్రహముంది. 2018లో గుజరాత్‌లోని నర్మదా నదీ తీరం వద్ద ఐక్యతా చిహ్నంగా 182 మీటర్ల ఎత్తులో సర్దార్ వల్లభబాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే విగ్రహం అంతకంటే ఎత్తు ఉండాలా? పాట్నాలో ఉన్న విగ్రహానికి మించిన ఎత్తులో దీనిని నిర్మాంచాలా? ఏ భంగిమలో ఉన్నట్టు తయారు చేయించాలి? అన్నదానిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎదుట ఉన్న మహాత్మగాంధీ కాంస్య విగ్రహమే ఇప్పటి వరకు తెలంగాణలో పెద్దది. ధ్యాన ముద్రలో ఉన్న ఈ గాంధీ విగ్రహం ఎత్తు 22 అడుగులు ఉంది. నా జీవితమే నా సందేశం (మై లైఫ్ ఈజ్ మై మెసేజ్) అన్న స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బాపూఘాట్‌లో ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహంపై ఆసక్తి నెలకొంది.