Share News

Hyderabad: ఇన్‌చార్జ్‌ల పాలనలో ఆర్‌ అండ్‌ బీ..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:58 AM

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇన్‌చార్జ్‌ల పాలనలో నడుస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) స్థాయి నుంచి చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ), ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) స్థాయి పోస్టుల వరకు అంతా ఇదే పరిస్థితి నెలకొంది.

Hyderabad: ఇన్‌చార్జ్‌ల పాలనలో ఆర్‌ అండ్‌ బీ..

  • ఏఈఈ నుంచి సీఈ వరకు విభాగంలో ఇదే పరిస్థితి

  • ఏళ్లుగా పెండింగ్‌లో సర్వీస్‌ రూల్స్‌, సీనియారిటీ జాబితా

  • రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణపై ప్రభావం

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇన్‌చార్జ్‌ల పాలనలో నడుస్తోంది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) స్థాయి నుంచి చీఫ్‌ ఇంజినీర్‌(సీఈ), ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) స్థాయి పోస్టుల వరకు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. శాఖలో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు లేక ఏళ్లు గడుస్తున్నాయి. కొన్నేళ్లుగా సర్వీస్‌ రూల్స్‌ అంశం పెండింగ్‌లో ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన సీనియారిటీ జాబితా రాకపోవడమే దీనికి కారణంగా కనబడుతోంది. మరోవైపు శాఖలో రిటైర్మెంట్ల పర్వం మొదలైంది. రిటైర్‌ అయిన వారి స్థానంలో కొత్త వారు వస్తుండగా, కింది స్థాయిలో ఖాళీ అయిన పోస్టులు మాత్రం భర్తీ కావడంలేదు. దీంతో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలపై పర్యవేక్షణ కొరవడుతోంది.


ఇదిలా ఉండగా ఆర్‌ అండ్‌ బీ శాఖలోని ఏఈఈ పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసింది. కానీ ఇప్పటి వరకు వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. శాఖలో జరుగుతున్న పదవీ విరమణలు, క్షేత్రస్థాయిలో ఖాళీ అవుతున్న పోస్టులతో పాటు పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏర్పడిన కొత్త పోస్టులన్నీ కలిపి వివిధ స్థాయిల్లో దాదాపు 200 వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 4వేల కి.మీ.కు పైగా రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈ పనులు చేపట్టాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం.


సర్వీస్‌ రూల్స్‌ కోసం నిరీక్షణ..

శాఖలో సీనియారిటీ జాబితా లేకపోవ డం, సర్వీస్‌ రూల్స్‌ ఫైలు కదలకపోవడంతో.. రెండింటి నడుమ ఉద్యోగులు నలిగిపోతున్నారు. శాఖలో భర్తీ చేయాల్సిన పలు పోస్టుల వ్యవహారం కూడా సీనియారిటీ, సర్వీస్‌ రూల్స్‌ అంశానికే ముడిపడి ఉంది. ఈ రెండు తేలితేనే.. ఎంతమందికి పదోన్నతులు లభిస్తాయి..? ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాల్సి ఉంటుంది..? అన్నది స్పష్టమవుతుంది. నిజానికి రోడ్లు, భవనాల శాఖలో దశాబ్దాల నుంచి సీనియారిటీ జాబితా లేకపోవడంతో ఉమ్మడి రాష్ట్రం నుంచీ సీనియర్‌, జూనియర్‌ విషయాల్లో వివాదాలు నడిచినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ హయాంలో 2011లో శివారెడ్డి కమిటీ రూపొందించిన సీనియారిటీ జాబితాను పలు కారణాలతో 2013లో హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయింది.


అయితే 2014 వరకు ఉన్న ఉద్యోగుల పోస్టింగ్‌లు, సీనియర్‌, జూనియర్‌ అంశాలన్నిటినీ ఏపీ తేల్చితేనే.. తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో సీనియర్‌, జూనియర్‌ ఎవరనేది తేలడంతో పాటు ఆమేరకు పదోన్నతులు దక్కనున్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతున్నా.. ఏపీ సీనియారిటీ లిస్ట్‌ను పూర్తి చేసి పంపకపోవడంతో ప్రస్తుతం శాఖ ఉద్యోగులంతా ఇన్‌చార్జ్‌లుగానే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా ఏళ్ల నుంచి శాఖలో సీనియారిటీ లిస్ట్‌ లేకపోవడంతో.. పదోన్నతులు ఇవ్వాల్సి వచ్చినపుడు తాత్కాలిక జాబితాను సిద్ధం చేసి.. ప్రమోషన్లు కల్పించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఒక శాశ్వత సీనియారిటీ జాబితా మాత్రం రూపుదాల్చలేదు.


మరోవైపు ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలో 2018 నుంచి కొత్త సర్వీస్‌ రూల్స్‌ పాటించాలని గత సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్వీస్‌ రూల్స్‌ను రూపొందించినా.. గత సీఎం పేషీలోనే పెండింగ్‌లో ఉండిపోయాయి. సర్వీస్‌ రూల్స్‌ విషయాన్ని పరిష్కరించడంతో పాటు, ఏపీ నుంచి రావాల్సిన సీనియారిటీ లిస్ట్‌పై దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్యోగులు కోరుతున్నారు. సర్వీస్‌ రూల్స్‌ ఫైలుపై సీఎం సంతకం చేస్తే దాదాపు 300-400 మంది ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయని అంటున్నారు. కాగా, శాఖలో ఇప్పటికే వివిధ స్థాయిల్లో 19మంది పదవీ విరమణ పొందగా, త్వరలో మరో 19మంది రిటైర్‌ కానున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో బాధ్యతలు తీసుకుంటున్న వారు కూడా ఇన్‌చార్జ్‌లుగానే వస్తుండటం గమనార్హం.

Updated Date - Jul 01 , 2024 | 04:58 AM