Telangana : రాష్ట్రావతరణ వేడుకలకు సోనియా
ABN , Publish Date - May 29 , 2024 | 05:42 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
సూత్రప్రాయంగా అంగీకరించారు
ఆమె పర్యటనకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు :ముఖ్యమంత్రి రేవంత్
సోనియాను ఆహ్వానించాక రేవంత్ వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులోఆమె చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు.
రాష్ట్రావతరణ వేడుకలకు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్.. ఆమెతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు అరగంటపాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితరాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించానని, తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.
సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయని అంటూనే.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
ఉద్యమకారుల జాబితాను రూపొందించాల్సిందిగా టీజేఎస్ అధినేత కోదండరామ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఉద్యమకారులందరినీ సముచితంగా గౌరవిస్తామని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్థాన్ గుర్తుకు వస్తుందని, కానీ, పాక్ ప్రధాని పుట్టిన రోజు వేడుకలకు ఎవరు వెళ్లారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.
పాక్ ప్రధానిని మోదీ కౌగిలించుకున్న ఘటనను గుర్తు చేశారు. పదేళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోందని విమర్శించారు.
దేశ ప్రధానిని, ప్రధాని పదవిని కాంగెరస్ ఎప్పుడూ అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. సోనియాతో భేటీ ముగిశాక సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. కేసీతో కలిసి భోజనం చేశారు. సీఎం పర్యటన వెంట కాంగ్రెస్ నాయకుడు రోహిణ్ రెడ్డి, ఆర్‌సీ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.