Share News

Noise Pollution: రాష్ట్రంలో డీజేల మోత బంద్‌!

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:31 AM

రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, బరాత్‌లు, ర్యాలీల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం అమలు కానుంది. డీజేల వినియోగంపై పదేళ్లుగా ఉన్న ఆంక్షలను కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది.

Noise Pollution: రాష్ట్రంలో డీజేల మోత బంద్‌!

  • వేడుకలు, ర్యాలీల్లో డీజే వాడకంపై నిషేధం

  • ప్రభుత్వానికి పోలీసు శాఖ ప్రతిపాదన

  • ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాగి జావ

  • వారంలో 3 రోజుల పాటు.. సర్కారు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, బరాత్‌లు, ర్యాలీల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం అమలు కానుంది. డీజేల వినియోగంపై పదేళ్లుగా ఉన్న ఆంక్షలను కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. డీజే లతో పెరుగుతున్న శబ్ద కాలుష్యం, మితిమీరిన చప్పుడుతో మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తదితర కారణాలతో డీజే మోతలను ఆపాలని పోలీసు శాఖ నిర్ణయించింది. డీజేల వాడకం వల్ల తలెత్తే సమస్యలు, శాంతిభద్రతల పరంగా ఎదురయ్యే ఇబ్బందులు, నిషేధంపై తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి పోలీసు శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.


ఆ నివేదిక పరిశీలన అనంతరం డీజేల వాడకంపై నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుంది. నిబంధనల ప్రకారం నివాస సముదాయాలు ఉన్న ప్రాంతంలో పగటి పూట 55 డెసిబుల్స్‌, రాత్రి వేళ 45 డెసిబుల్స్‌ శబ్దం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నిబంధనను ఇకపై కచ్చితంగా అమలు చేయనున్నారు. నిజానికి వినాయక చవితి అనంతరం అన్ని వర్గాల వారితో సమావేశమైన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజేల వాడకంపై నిషేధం విధించారు. ఆ తర్వాత రాచకొండ, వరంగల్‌ కమిషనర్లు కూడా వేర్వేరుగా అదే తరహా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయనున్నారు.


  • ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం...

డీజేలు ఉపయోగించడం వల్ల సాధారణంగానే 100-150 డెసిబుల్స్‌ శబ్దం ఉత్పత్తి అవుతుంది. పరిమితికి మించిన శబ్దం ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న మనిషి 45 -55 డెసిబుల్స్‌ శబ్దాన్ని భరించగలరు. అంతకుమించి శబ్దం వింటే అధిక రక్తపోటు, గుండె పనితీరు అదుపు తప్పడం, నాడీ వ్యవస్థపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డీజే శబ్దం వల్ల ఇతరులతో పోలిస్తే గర్భిణీలకు అధిక ముప్పు.


  • డీజేలతో అనవసర ఇబ్బందులు

ఉత్సవాలు, ఊరేగింపులు, శుభకార్యాల్లో డీజే వాడకం వల్ల అనవసర సమస్యలు తలెత్తుతున్నాయి. డీజే వాడకంపై పదేళ్లుగా నిషేధం ఉంది. ఈ నిషేధాన్ని ఇక పక్కాగా అమలు చేస్తాం.

- జితేందర్‌, డీజీపీ

Updated Date - Oct 04 , 2024 | 03:31 AM