Health Crisis: గిరిజన పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 02 , 2024 | 05:38 AM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలోని విద్యార్థినులు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు.
3 రోజుల్లో 45 మందికి వాంతులు, విరేచనాలు
వాంకిడి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలోని విద్యార్థినులు మూడు రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారు. బుధవారం దాదాపు 30 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. గురువారం మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో బాలికలను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం మరో 11మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రోజురోజుకూ అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీ సుకెళ్తున్నారు. సమాచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ దీపక్ తివారీ.. గురువారం స్థానిక గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను, ప్రభుత్వవైద్యశాలను సందర్శించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.