Share News

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:20 AM

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది సుమారు 30 వేల మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది.

Supreme Court: గ్రూప్‌-1 రద్దు కుదరదు..

  • పిటిషనర్లు ఎవరూ మెయిన్స్‌కు అర్హతే సాధించలేదు

  • 30 వేల మందికి సంబంధించిన అంశమిది: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది సుమారు 30 వేల మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 రద్దు, మెయిన్స్‌ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. సుప్రీం తీర్పుతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు (టీజీపీఎస్సీ) భారీ ఊరట లభించినట్టయింది. గత ప్రభుత్వం 2022లో గ్రూప్‌-1 నోటిపికేషన్‌ ఇచ్చినప్పటికీ.. పరీక్ష పేపర్ల లీకేజీతో ఒకసారి, నిర్వహణ లోపంతో మరోసారి పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ను పక్కన పెట్టి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వగా.. అది చట్టవిరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ గంగుల దామోదర్‌ రెడ్డి అనే వ్యక్తి సహా ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వారికి నిరాశ ఎదురైంది. దీంతో హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.


ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాది గురు కృష్ణకుమార్‌ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొత్తప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిందని తెలిపారు. కొత్త నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 14 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరీక్ష తేదీలోనూ మార్పు చేశారని తెలిపారు. ప్రశ్నల్లో తప్పులపై టీజీపీఎస్సీ నియమించిన నిపుణుల కమిటీ రిపోర్టు సైతం సరిగా లేదని ఆరోపించారు. అందుకే, ప్రిలిమ్స్‌పై స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ రిపోర్టు వచ్చే దాకా మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. హైకోర్టు మెరిట్స్‌లోకి వెళ్లకుండానే తమ పిటిషన్‌ను కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.


అయితే, ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 29పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని గుర్తు చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం గ్రూప్‌-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. కేవలం ఏడుగురు అభ్యర్థుల కోసం.. అది కూడా మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించని వారికోసం ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేయడం కుదరదని చెబుతూ, పిటిషన్‌ను కొట్టేసింది. కాగా.. గ్రూప్‌-1 వాయిదాకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది అక్టోబరు 21న కూడా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉండగా స్టే ఎలా ఇస్తామని నాడు ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పుడు ఈ తీర్పుతో.. గ్రూప్‌-1 ఫలితాల వెల్లడికి అడ్డంకులు పూర్తిగా తొలగినట్టయింది. ఈనేపథ్యంలో.. వీలైతే జనవరి నెలాఖరులోగా ఫలితాలను ప్రకటించి, ఫిబ్రవరిలోగా నియామకాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 04:20 AM