టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:52 AM
తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు, ఆందోళనలకు దిగిన తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. టీజీఎస్పీ సిబ్బంది ప్రత్యేకంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచారం
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెట్టేవారిపై కఠిన చర్యలు
బెటాలియన్లలో దర్బార్‌లు నిర్వహిస్తూ..సిబ్బంది సమస్యలు వింటున్న అధికారులు
ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సెలవు ఇవ్వడంలేదంటూ ఒంటిపై పెట్రోల్
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు, ఆందోళనలకు దిగిన తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. టీజీఎస్పీ సిబ్బంది ప్రత్యేకంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచారం మార్చుకోవడంతోపాటు, అధికారుల తీరుపై అభ్యంతరకర పోస్టింగ్‌లు పెడుతున్నట్లు గుర్తించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఇతరులను రెచ్చగొడుతూ నిరసనలు తీవ్రతరం చేసే ప్రయత్నాలు చేస్తున్ననట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఆ తరహా పోస్టింగ్‌లు పెట్టినవారు, తమకు వచ్చిన పోస్టింగ్‌లను ఇతరులకు షేర్ చేసిన వారి వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. అలాంటి వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, నిరసనలకు దిగిన వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేయడంతోపాటు కొందరిని సర్వీసు నుంచి తొలగించిన ఉన్నతాధికారులు.. మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు బెటాలియన్లలో దర్బార్‌లు నిర్వహిస్తూ సిబ్బంది సమస్యలను అధికారులు వింటున్నారు.
యూనిఫాం సర్వీ్‌సలో ఉండి నిరసనలు చేయవద్దని చెబుతూ.. నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తున్నారు. అధికారులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించడంతో ఇప్పటికే కొందరు నిరసనలు వీడి రోజువారీ విధుల్లో పాల్గొంటున్నారు. మరికొందరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. కాగా, టీజీఎస్పీ పోలీసులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో కోరారు. తరచూ బదిలీల వల్ల తాము, తమ పిల్లలు, కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నామంటూ బెటాలియన్ పోలీసులు వ్యక్తం చేస్తున్న ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. న్యాయం కోరిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం, అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీజీఎస్పీ 3వ బెటాలియన్ కానిస్టేబుల్ ఒకరు మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 2021 బ్యాచ్‌కి చెందిన టీజీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వర్‌రావు మంగళవారం ఉదయం సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే బందోబస్తు ఉన్నందున సెలవు ఇవ్వడం కుదరదని ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో సాయంత్రం రోల్‌కాల్‌లో ఉండగానే నాగేశ్వర్‌రావు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నారు. వెంటనే సహచర కానిస్టేబుళ్లు ఆయనను పక్కకు తప్పించారు. కాగా, నాగేశ్వర్‌రావుకు ఐదు రోజులు సెలవు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.