Rama Devi: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు..
ABN , Publish Date - Sep 19 , 2024 | 03:05 AM
కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది.
అర్చకుడైన ఆయన కుమారుడిపై కూడా..
భద్రాచలం,సెప్టెంబరు 18: కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. అదే దేవస్థానంలో అర్చకుడిగా పని చేస్తున్న సీతారామానుజాచార్యులు కుమారుడు పొడిచేటి సీతారామం కూడా సస్పెండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి బుధవారం జారీ చేశారు. తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, రూ.10 లక్షలు తీసుకురావాలని అత్త, ఇతర కుటుంబసభ్యులు తనని వేధిస్తున్నారని సీతారామానుజాచార్యులు కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగస్టు 14న కేసు నమోదైంది. ఈ కేసు విషయాన్ని సీతారామానుజాచార్యులు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లలేదు. రెండ్రోజుల క్రితం కేసు విషయం బయటికి రాగా.. సీతారామానుజాచార్యులు, సీతారామంకు ఉన్నతాధికారులు చార్జ్ మొమో జారీ చేశారు. ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇరువురిని సస్పెండ్ చేశారు.
తొలి నుంచి వివాదాస్పదుడే..
భద్రాద్రి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న పొడిచేటి సీతారామానుజాచార్యులకు తొలి నుంచి వివాదాస్పదుడనే పేరుంది. గతంలో పలువురు వైదిక సిబ్బంది పదోన్నతుల అంశంలో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దేవాలయ అంతరాలయంలో పూజలు నిర్వహించే అవకాశం కేవలం అనువంశిక అర్చకులకే ఉంటుంది. తన దత్తపుత్రుడు సీతారామానికి ఆ అవకాశం దక్కేందుకు ఆయన చేసిన ప్రయత్నాలపై ఇతర అర్చకులు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఇక, తొమ్మిదేళ్ల క్రితం అమ్మవారి ఆభరణాలు మాయమై ప్రత్యక్షమైన ఘటనలో సీతారామానుజాచార్యులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇక, గతంలో మాఢ వీధుల అభివృద్ధి కోసం దేవస్థానానికి స్థలం ఇచ్చేందుకు నిరాకరిస్తూ సీతారామానుజాచార్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఖగోళయాత్రలో పాల్గొని దేవదాయశాఖ, దేవస్థానంమార్గదర్శకాలను ఉల్లంఘించి విమర్శల పాలయ్యారు.