Telangana Cabinet: త్వరలో విస్తరణ!
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:54 AM
కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్‌గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వారం పది రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం
రాహుల్‌గాంధీతో భట్టి విక్రమార్క భేటీ.. మంత్రివర్గ విస్తరణ, కులగణనపై చర్చ
నేడు పార్టీ అధిష్ఠానంతో సీఎం రేవంత్ సమావేశం
ఢిల్లీకి ఆశావహులు.. ముమ్మరంగా ప్రయత్నాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాహుల్‌గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. చర్చలు ఫలప్రదమైతే వారం పది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. కాగా, గత కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాహుల్‌కు భట్టిచెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో కులగణన సర్వే బాగా జరిగిందని, దీనివల్ల బీసీలు పార్టీకి సానుకూలంగా మారుతున్నారని, కులగణన వివరాల ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా భట్టి తెలిపినట్టు సమాచారం. కులగణనను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసినందుకు భట్టిని రాహుల్ అభినందించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈసారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా మంత్రివర్గ విస్తరణపైనే అధిష్ఠానంతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టడంతోపాటు, పదవులు రానందుకు అసంతృప్తిగా ఉన్న వివిధ నేతలను కూడా బుజ్జగించాల్సిన అవసరం ఉందని, విస్తరణ తాలూకు పర్యవసానాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ వర్గీయులు భావిస్తున్నారు.
ఢిల్లీకి ఆశావహులు
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు ఢిల్లీకి రావడం మళ్లీ ప్రారంభమైంది. మల్‌రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే రాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం రానున్నట్లు తెలిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించే వారికి సంబంధించి.. సుదర్శన్‌రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల మరో ఏడెనిమిది ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రె్‌సకు లభించే అవకాశం ఉన్నందువల్ల.. ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే ఒకరిద్దరు నేతలకు కూడా మంత్రివర్గంలో చోటు లభించవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ జాబితాలో షబ్బీర్ అలీ, పహీం ఖురేషీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రేమ్‌సాగర్ రావు పేరును కూడా భట్టి విక్రమార్క ఢిల్లీ నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఇక.. తనను మంత్రివర్గంలో తీసుకుంటానని హామీ ఇచ్చి కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని, తాను భువనగిరి అభ్యర్థిని కూడా గెలిపించుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు చెబుతున్నట్టు తెలిసింది. మొత్తమ్మీద, మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం ముందుకొచ్చింది.