Share News

Teacher Transfers: సర్దుబాటుతో 4 వేల మంది టీచర్ల బదిలీ!

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:06 AM

సర్దుబాటులో భాగంగా నాలుగు వేల మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది.

Teacher Transfers: సర్దుబాటుతో 4 వేల మంది టీచర్ల బదిలీ!

  • ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు!

  • దసరా తర్వాత కొత్త పోస్టింగ్‌ల్లోకి..

  • కసరత్తు ప్రారంభించిన విద్యా శాఖ

  • 28న ప్రారంభం.. వారంలోగా పూర్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): సర్దుబాటులో భాగంగా నాలుగు వేల మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు... వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్దుబాటులో భాగంగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం కొత్త పోస్టింగ్‌ల్లో చేరేలా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేశారు. దీని ప్రకారం తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు.


జిల్లా యూనిట్‌గా చేపడుతున్న ప్రక్రియను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 28వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. ఏయే స్కూళ్లల్లో ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేయాలనే విషయంపై ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేశారు. దీని ప్రకారం... ప్రైమరీ స్కూళ్లల్లో 1-10 మంది విద్యార్థులుండే స్కూళ్లల్లో ఒక టీచర్‌, 11-60 మంది ఉంటే ఇద్దరు, 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు, 120 మంది విద్యార్థులుండే స్కూళ్లల్లో నలుగురు టీచర్లు, 150 మంది ఉంటే ఐదుగురు, 200 మంది విద్యార్థులుంటే.. ఆరుగురు ఉండాలి. అప్పర్‌ ప్రైమరీ, హైస్కూళ్లల్లో అయితే... విద్యార్థుల సంఖ్యతో పాటు సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలి. ఇలా విద్యార్థుల సంఖ్య అధారంగా ఆయా స్కూళ్లల్లో ఎంత మంది ఉపాధ్యాయులు పని చేయాలనే విషయాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు ఏదైనా పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉండాల్సిన సంఖ్య కన్నా ఎక్కువ మంది టీచర్లు ఉంటే.. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు.


వీలైనంత వరకు సమీపంలోని స్కూళ్లకు టీచర్లను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలా సాధ్యం కాకపోతే.... అదే మండలంలోని ఇతర స్కూళ్లకు బదిలీ చేస్తారు. ఒక వేళ ఒకే మండలంలో సర్దుబాటు చేయలేని పరిస్థితి ఎదురైతే... పక్క మండలంలో సర్దుబాటు చేయనున్నారు. సర్దుబాటులో స్కూలు మారాల్సి వచ్చే ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లను తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర పాఠశాలలకు వెళ్లడానికి సమ్మతించే టీచర్లను మొదటి దశలో సర్దుబాటు చేయనున్నారు. ఆ తర్వాత కూడా టీచర్లను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉన్న స్కూళ్లల్లో సీనియారిటీ ప్రకారం ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు మార్చాలని భావిస్తున్నారు. ఏయే స్కూళ్లల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ? అక్కడ ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. దీని ప్రకారం ఏయే స్కూళ్ల నుంచి ఎంత మంది టీచర్లను ఇతర పాఠశాలలకు పంపించాలనే విషయంపై జాబితాను రూపొందిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 03:06 AM