Share News

Nalgonda: ఫోన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ తీగను తాకి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:24 AM

ఓ బాలుడు తమ ఇంటి మేడ మీద నిలబడి ఫోను మాట్లాడుతూ యథాలాపంగా విద్యుత్‌ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Nalgonda: ఫోన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ తీగను తాకి..

  • ఇంటి మేడ మీదే విద్యుదాఘాతానికి బాలుడి బలి

గుర్రంపోడు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓ బాలుడు తమ ఇంటి మేడ మీద నిలబడి ఫోను మాట్లాడుతూ యథాలాపంగా విద్యుత్‌ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటనలో నేతాళ్ల కిరణ్‌(15) అనే బాలుడు మరణించాడు. మక్కపల్లికి చెందిన నేతాళ్ల పెద్దరాజు దంపతుల చిన్న కుమారుడు కిరణ్‌.. పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నిద్ర లేచిన కిరణ్‌.. పళ్లు తోముకుంటూ తమ ఇంటి మేడ మీదకు వెళ్లాడు. అక్కడే ఫోన్‌ మాట్లాడుతూ.. ఇంటిపై నుంచి చేతికందే ఎత్తులో వెళుతున్న 11కేవీ విద్యుత్‌ తీగలను అనుకోకుండాతాకి విద్యుదాఘాతానికి గురయ్యాడు.


విద్యుదాఘాతం దెబ్బకు కిరణ్‌ చెయ్యి కాలిపోయింది. కాసేపటికి తల్లిదండ్రులు మేడ మీదకు వచ్చి చూడడంతో జరిగిన దారుణం తెలిసింది. ఈ ఘటనపై పెద్దరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం వల్లే తమకుమారుడు మృతి చెందాడని పెద్దరాజు దంపతులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం తాము ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి... ఇంటి మీదుగా వెళుతున్న 11కేవీ విద్యుత్‌ తీగలను పక్కకు జరపాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 05:24 AM