Share News

Sridhar Babu: ఏఐ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:00 AM

రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: ఏఐ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌

  • గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌లో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్‌ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌ 2024’ ప్రారంభ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఏఐ డెస్టినేషన్‌గా మార్చడానికి తమ వద్ద అన్ని హంగులూ ఉన్నాయని, 200 ఎకరాలలో ఏఐ సిటీని రూపొందిస్తున్నామని చెప్పారు. ఇది ఏఐ రంగంలోని మేధావులు, కంపెనీలు, పరిశ్రమలు, స్టార్ట్‌పలకు వేదికగా ఉంటుందన్నారు.


ఏఐ పాలసీ రూపకల్పనకు నిపుణులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ కోసం ఒక స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని కూడా నెలకొల్పుతామని చెప్పారు. ఏఐ సిటీ నిర్మాణం పూర్తయ్యే లోపున తాము శంషాబాద్‌ వద్ద విశాలమైన స్థలంలో ఏఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌ సెంటర్‌లకు వేదిక కల్పిస్తామన్నారు. వాళ్లు అక్కడి నుంచి తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చునన్నారు. డీప్‌ ఫేక్‌, తప్పుడు సమాచారం ద్వారా వ్యక్తులను, సంస్థలను తప్పుదోవ పట్టించే చర్యలను నియంత్రిస్తామన్నారు. డేటా ప్రైవసీ విషయంలో కూడా కఠినమైన నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు.


తమ కార్యాచరణలో భాగంగా ఏఐ నైపుణ్యం కలిగిన వర్క్‌ ఫోర్స్‌ను తయారుచేస్తామనీ, ఏఐ లిటరసీని ప్రోత్సహిస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టమైన రాష్ట్రంగా ఎదిగిందని శ్రీధర్‌ బాబు అన్నారు. సంవత్సరానికి 11.3 శాతం ఆర్థిక వృద్ధిని సాధించడంతోపాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 176 మిలియన్‌ డాలర్లకు చేరుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని త్వరలో ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్న ఆయన దశాబ్ధ కాలంలో మూడు ట్రిలియన్లుకు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌కు తమ రాష్ట్రం వేదికగా మారడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 04:00 AM