High Court: వాళ్లు బీఆర్‌ఎస్ సభ్యులుగానే..!
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:04 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రేవంత్ సర్కారు వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది.
పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి నియామకమే సంకేతం
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
స్పీకర్ నిర్ణయంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూలు జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రేవంత్ సర్కారు వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశం వెలువడిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన గాంధీ.. కొద్ది రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పోస్టును అరికెపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా.. ఆయనను బీఆర్‌ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లుగా స్పీకర్ సంకేతం ఇచ్చారు. వాస్తవానికి, పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఇందులో 13 మంది సభ్యులు కూడా ఉంటారు.
సభ్యులకు ఎన్నిక జరుగుతుంది. కానీ, చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. పీఏసీలోని 13 మంది సభ్యుల్లో 9 మందిని శాసనసభ నుంచి ఎన్నుకుంటారు. శాసనసభలో ఆయా పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి వీరు ఎన్నికవుతారు. శాసనసభలో బీఆర్‌ఎ్‌సకున్న సంఖ్యా బలాన్ని బట్టి ముగ్గురు ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే, పీఏసీ చైర్మన్‌గా మాజీ మంత్రి హరీశ్ రావును; సభ్యులుగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రతిపాదించింది. పీఏసీలో సభ్యత్వం కోసం వారితో నామినేషన్లనూ వేయించింది. పీఏసీ సభ్యునిగా ఎన్నిక కోసం అరికెపూడి గాంధీ కూడా నామినేషన్ వేశారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేల్లో హరీశ్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పోటీలో ఉండగా.. హరీశ్ మినహా మిగిలిన ముగ్గురూ పీఏసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీని స్పీకర్ ప్రసాద్‌కుమార్ చైర్మన్‌గా నియమించారు. తద్వారా ఆయనను బీఆర్‌ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లు సంకేతం ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది.
స్పీకర్.. కింకర్తవ్యం!?
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాజ్యాంగం ప్రకారం అదే స్థాయిలో ఉన్న శాసనసభ స్పీకర్ అమలు చేస్తారా!? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావిస్తుంటే.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు, అందుకు వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఆయా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడమనేది స్పీకర్ విచక్షణకు సంబంధించినదని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అందులో జోక్యం చేసుకోవడం ద్వారా న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థల మధ్య ఘర్షణ అనివార్యమని వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశంపై అసెంబ్లీ కార్యదర్శి లేదా ప్రభుత్వం లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలైనా డివిజన్ బెంచ్‌కు వెళ్లవచ్చని, అక్కడా తీర్పు వ్యతిరేకంగా వస్తే.. సుప్రీం కోర్టుకూ వెళ్లవచ్చని చెబుతున్నాయి.