Gaddam Prasad Kumar: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
ABN , Publish Date - Dec 12 , 2024 | 04:19 AM
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తరహాలో శాసనసభలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సభ్యునికి ‘ఉత్తమ లెజిస్లేచర్’ అవార్డును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దూరం
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తరహాలో శాసనసభలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సభ్యునికి ‘ఉత్తమ లెజిస్లేచర్’ అవార్డును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీఐ)లో బుధవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా కార్యక్రమాన్ని(లెజిస్లేచర్ ఓరియంటేషన్) ప్రసాద్‌కుమార్‌తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది.
ఈ సందర్భంగా ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన ఉంటేనే.. సభలో వారు అర్థవంతంగా మాట్లాడగలుగుతారని చెప్పారు. గడిచిన పదేళ్లలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇలాంటి శిక్షణా కార్యక్రమం జరగలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 57 మంది కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారని, వారు ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో పాటుగా 65 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.