Share News

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు

ABN , Publish Date - Nov 14 , 2024 | 03:53 AM

విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది.

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు

  • అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపు

  • దాడులు విధులకు ఆటంకం కాదు: ఐఏఎస్‌ అధికారుల సంఘం

  • కేటీఆర్‌.. మీకు పోలీస్‌ విధులు తెలియవా?: అధికారుల సంఘం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, కార్మికులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల తరఫున ఖండిస్తున్నామని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు తెలిపారు. బుధవారం టీజీవో భవన్‌లో మీడియాతో వారు మాట్లాడారు. దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద, హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. దాడులు మరోసారి పునరావృతమైతే 10 లక్షల మంది ఉద్యోగులకు నాయకత్వం వహించే 206 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో ఉన్న జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తుందని హెచ్చరించారు.


ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగుల జేఏసీ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్‌, ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌ రెడ్డి, గౌతమ్‌.. సంఘం నేతలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీఎస్‌ శాంతికుమారికి సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాలు చేయాలని వి.లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఉద్యోగుల జేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులపై జరిగిన దాడిని ఖండించకపోగా కొందరు నాయకులు దాడికి పాల్పడిన వారిని పరామర్శించడం ప్రజాస్వామ్యానికే అవమానమని లచ్చిరెడ్డి పేర్కొన్నారు. కాగా, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌పై జరిగిన దాడిని తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శశాంక్‌ గోయెల్‌, కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి దాడులు.. అధికారుల విధులను ఏవిధంగానూ ఆటంక పర్చలేవని పేర్కొన్నారు. కాగా, పోలీస్‌ విధులపై మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యల్ని పోలీస్‌ అధికారుల సంఘం తప్పుబట్టింది. పదేళ్లు పరిపాలించిన వారికి పోలీస్‌ విధుల గురించి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపీరెడ్డి అన్నారు. పోలీస్‌ విధుల్లో జోక్యం చేసుకోవద్దని, పోలీస్‌ వ్యవస్థను తప్పుపట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

Updated Date - Nov 14 , 2024 | 03:53 AM