Share News

Sridhar Babu: ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:04 AM

తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

Sridhar Babu: ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

  • ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచింది:శ్రీధర్‌ బాబు

  • న్యూజెర్సీ ఇన్నోవేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌తో టీ-హబ్‌ ఒప్పందం

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కృత్రిమ మేధ, జీవశాస్త్రాలు, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచిందని తెలిపారు. టీ-హబ్‌ ఫౌండేషన్‌ న్యూజెర్సీ ఇన్నోవేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలతో వాణిజ్య, సాంకేతిక ఆవిష్కరణల భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభావంతులను ప్రోత్సహించడం ద్వారా భారతీయ అమెరికన్లు, వృత్తి నిపుణులకు న్యూజెర్సీ మంచి అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.


స్కిల్స్‌ వర్సిటీలో నాస్కామ్‌ భాగస్వామి కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో నాస్కామ్‌ భాగస్వామి కావాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన నాస్కామ్‌ అధ్యక్షుడు రాజేశ్‌ నంబియార్‌తో పలు అంశాలపై చర్చించారు. కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఐటీ ఉద్యోగులకు, ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు శిక్షణ ఇవ్వడంలో నాస్కామ్‌ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందని, కొత్త సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు నాస్కామ్‌ తన పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగం దేశంలోనే అగ్రగామిగా మారుతుందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు.

Updated Date - Dec 12 , 2024 | 03:04 AM