Share News

Bonus: ఎమ్మెస్పీ.. ఆ తర్వాత బోనస్‌!

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:06 AM

సన్నధాన్యంపై క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎలా జమ చేయాలన్న అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది.

Bonus: ఎమ్మెస్పీ.. ఆ తర్వాత బోనస్‌!

  • సన్న ధాన్యానికి గంటల్లోనే చెల్లింపులు

  • ధాన్యం సేకరణ విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సన్నధాన్యంపై క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ఎలా జమ చేయాలన్న అంశంపై ఓ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ద్వారా కనీస మద్దతు ధర (రూ. 2,300 - రూ. 2,320)ను రైతుల ఖాతాల్లో జమచేయాలని, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నుంచి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ జమచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వేర్వేరు సాఫ్ట్‌వేర్‌ విధానాలను రూపొందించారు. తొలుత కార్పొరేషన్‌ చెల్లింపులు చేసిన తర్వాత ఆ మేరకు ఇచ్చిన క్లియరెన్స్‌తో డిపార్ట్‌మెంట్‌ బోనస్‌ చెల్లింపులు చేస్తుంది.


తద్వారా సన్నధాన్యం అమ్మిన రైతులకు క్వింటాకు బోన్‌సతో కలిపి రూ. 2,800 నుంచి రూ.2,820 చొప్పున జమచేయనున్నా రు. ఉదాహరణకు.. ఓ రైతు 25 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే.. మద్దతు ధర క్వింటాకు రూ.2,300 చొప్పున రూ.57,500 కార్పొరేషన్‌.. రైతు ఖాతాలో వేస్తుంది. అనంతరం పౌరసరఫరాల శాఖ నుంచి క్వింటాకు రూ.500 చొప్పున రూ.12,500 బోనస్‌ సదరు రైతు ఖాతాలో జమవుతుంది. కాగా, ధాన్యం సేకరణపై విధివిధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.


నలుగురు మంత్రులతో సబ్‌కమిటీ వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావులను ఉపసంఘంలో సభ్యులుగా వేశారు. సబ్‌ కమిటీ సభ్యులు అధ్యయనం చేసే అంశాల్లో... రైస్‌మిల్లర నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవటం, గోదాములను అద్దెకు తీసుకోవటం, రైస్‌మిల్లర్లకు మిల్లింగ్‌ చార్జీలు, ధాన్యం నిల్వ తరుగు సమస్యలతోపాటు ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర ప్రభు త్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఈ సబ్‌కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 04:06 AM