Share News

TG Government: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:23 PM

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం లభించనుంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

TG Government: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్

హైదరాబాద్ : ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం లభించనుంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ హామీతో ఫ్లైఓవర్ పనులు జోరు అందుకోనున్నాయి. పనుల్లో అలసత్వం వహించిన గాయత్రీ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను రద్దు చేసి.. కొత్త కాంట్రాక్టర్‌తో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. తొలుత యుద్ధ ప్రాతిపదికన 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరమ్మత్తు చేయనుంది. ఆరేళ్లయిన, 6 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కాకపోవడంపై ఆర్అండ్‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు.


ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికాక పోవడంతో గుంతల రోడ్లతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. పిల్లర్లు దాటి ఒక్క అడుగు కూడా ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ ముందుకు పడటం లేదు. 670 కోట్ల రూపాయలతో 6.2 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌గా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. నులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక చిక్కులు, మరోవైపు అధికారుల అలసత్వంతో ఆరు లేన్ల ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం రాజ్యమేలుతోంది. 2018 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీ 24 మాసాల్లోనే పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది. కానీ వివిధ కారణాలు చూపుతూ పనులను ఆలస్యం చేయగా, గత రెండేళ్ల నుంచి అసలు పనులే నిర్వహించడం లేదు. దాంతో రూ.626.76 కోట్లతో చేపట్టిన 6.25 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నిలిచిపోయాయి.


ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌పై చర్చించారు. కొత్త కంపెనీకి పనులు అప్పగించాలని లేదంటే నిలిచిపోయిన పనులతో పాటు, ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరోసారి టెండర్లు ఆహ్వానించాలని కోరారు. దీంతో గడ్కరీ ప్రాజెక్టు పూర్తికి ఎలా ముందుకెళ్లాలో తెలపాలని జాతీయ ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ విభాగం అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి నివేదిక అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 44 శాతం పనులే పూర్తయ్యాయి. మొత్తం 143 పిల్లర్లకు 137 పూర్తయ్యాయి. పిల్లర్లపై నిర్మించాల్సిన 142 స్పాన్లలో 36 మాత్రమే పూర్తయ్యాయి.

Updated Date - Aug 05 , 2024 | 01:23 PM