Share News

CM Revanth Reddy: పజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక

ABN , Publish Date - Nov 23 , 2024 | 03:19 AM

ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

CM Revanth Reddy: పజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక

  • ప్రతిపక్షాల విమర్శలకు దాంట్లోనే జవాబు

  • ఏడాది పాలనలో ఏం చేశారో చెబుతారు

  • శాఖల వారీగా వ్యయం వివరాల సేకరణ

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబరు 7 నుంచి ఈ ఏడాది డిసెంబరు 7 వరకు ఏడాది కాలంలో ఏమేం చేశామో రాష్ట్ర ప్రజలకు తెలపాలని నిర్ణయించింది. ప్రజా విజయోత్సవాల చివరి రోజున ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి వివరాలను ‘ప్రగతి నివేదిక’ రూపం లో ప్రజలకు వివరిస్తారు. ఇందుకోసం అన్ని శాఖల నుంచి ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన ఖర్చు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలతో పాటు ఇంకా చెల్లించాల్సిన వడ్డీలు ఎంత అనే అన్ని వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ముఖ్యమైన విభాగాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు చేరాయి. మిగిలిన శాఖల నుంచి ఒకటి, రెండ్రోజుల్లో పూర్తి వివరాలు అందుతాయి. వాటన్నింటినీ క్రోడీకరించి నివేదిక రూపంలో విడుదల చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్‌ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రముఖ గేయ రచయితలతో ప్రత్యేక పాటలను కూడా సిద్ధం చేయించారు.


  • ఉద్యోగాల భర్తీ

టీఎ్‌సను కేంద్రంతో మాట్లాడి టీజీగా మార్చిన దగ్గరి నుంచి, ఉద్యోగాల భర్తీ వరకు చిన్న పెద్ద విజయాలన్నీ వివరిస్తారు. డీఎస్సీ, గ్రూపు పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం, పరీక్షలు పెట్టడం ప్రస్తావిస్తారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే సిలిండర్‌ అమలు చేస్తున్న విషయం ప్రస్తావిస్తారు.

  • రుణమాఫీ, హైడ్రా, మూసీ, స్కిల్‌ వర్శిటీ

రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణమాఫీ హామీ అమల్లో భాగంగా రూ.18 వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేసిన విషయం ప్రస్తావిస్తారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ అందని రైతుల పరిస్థితిని కూడా వివరిస్తారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రస్తావిస్తారు. హైదరాబాద్‌లో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రవేశపెట్టిన హైడ్రా వల్ల కలిగే లాభాలను ప్రగతి నివేదికలో వివరిస్తారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం తీసుకున్న సంకల్పం, ఎందుకు అంతపెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఏం చేయబోతున్నారు? అనేది వివరిస్తారు. ఎన్నికల హామీ కానప్పటికీ ‘‘యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ’’ ఏర్పాటుకు పూనుకుని, క్రీడా పాలసీని తీసుకొచ్చి, సమీకృత గురుకుల భవనాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భారీ ఎత్తున చేపట్టనున్న విషయాన్ని చెబుతారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న రూ.5 లక్షల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచింది ప్రస్తావిస్తారు. గత ప్రభుత్వం కొత్తగా 8 మెడికల్‌ కళాశాలలు ప్రకటించినా సౌకర్యాల లేమితో అనుమతులు రాని పరిస్థితుల్లో వాటిని సాధించిన విషయాన్ని గుర్తు చేస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగాన్ని కొలిక్కి తేవడం, దక్షిణ భాగాన్ని సొంతంగానిర్మించతలపెట్టడం, మామునూరు విమానాశ్రయం అడ్డంకులను తొలగించడం వంటివి ప్రస్తావిస్తారు. ఏడాది విజయాలను సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఆట-పాటలతో వివరిస్తారు. ఇందుకు 570మంది సాంస్కృతిక సారఽఽథులతో కళాజాత బృందాలను సిద్ధం చేస్తోంది. జానపద గేయ రచయిత యశ్‌పాల్‌ బృందం రాసిన ప్రత్యేక గేయాలతో ప్రదర్శనలు నిర్వహిస్తారు. డిసెంబర్‌ 10వరకూ రోజుకు కనీసం 3 చోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇప్పటికే సాంస్కృతిక శాఖ కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.


  • మాట నిలబెట్టుకున్నాం: సీఎంవో

తొలి ఏడాదిలోనే అర లక్ష ఉద్యోగాలను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగాల భర్తీలో కొత్త రికార్డు నమోదు చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళించామని ప్రస్తావించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయిదా పడ్డవి అన్నింటినీ పరిష్కరించి ఫలితాలను విడుదల చేశామని గుర్తు చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించినట్టు పేర్కొంది. వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా మార్చామని తెలిపింది. భర్తీ చేసినవి, పోటీ పరీక్షలు పూర్తయినవి కలిపి ఇప్పటికే 53,310 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రగతి నివేదికలో పేర్కొననున్నారు. టీజీపీఎస్సీ ద్వారా 3,393, వైద్య రంగంలో 6,956, పోలీసుల్లో 16,067, గురుకులాల్లో 8,304, డీఎస్సీలో 10,006, ఇతర సంస్థల ద్వారా 441, గ్రూప్‌-4 నియామకాలు 8,143 పోస్టులున్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 03:19 AM