Share News

High Court: తొలగించిన 1200 మంది ఎంపీహెచ్‌ఏలను తిరిగి తీసుకోవడం చెల్లదు

ABN , Publish Date - Dec 01 , 2024 | 05:03 AM

కోర్టు ఆదేశాలతో తొలగించిన దాదాపు 1200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపీహెచ్‌ఏ) సిబ్బందిని తిరిగి తీసుకోవడం చెల్లదని తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసింది.

High Court: తొలగించిన 1200 మంది ఎంపీహెచ్‌ఏలను తిరిగి తీసుకోవడం చెల్లదు

  • ఉభయ రాష్ట్రాలకు తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలతో తొలగించిన దాదాపు 1200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఎంపీహెచ్‌ఏ) సిబ్బందిని తిరిగి తీసుకోవడం చెల్లదని తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసింది. వారిని తిరిగి తీసుకుంటూ 2013లో జారీచేసిన జీవో నంబరు 1207ను కొట్టివేసింది. ఎంపీహెచ్‌ఏ పోస్టుల భర్తీ కోసం 2002లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పోస్టులకు సంబంధించిన కనీస విద్యార్హతల విషయంలో వివాదంరావడంతో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తొలుత ఇంటర్మీడియెట్‌ కనీస అర్హతతో మెరిట్‌ లిస్టును రూపొందించారు. ఆ తర్వాత పదో తరగతి, హెల్త్‌ అసిస్టెంట్‌ డిప్లొమోలను కూడా కనీస అర్హతగా పరిగణించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మెరిట్‌ జాబితా మారిపోయింది.


హైకోర్టు తీర్పుతో 1200 మంది ఎంపీహెచ్‌ఏలను తొలగించారు. ఆ తర్వాత మంత్రుల బృందం ఈ అంశాన్ని పరిశీలించి, తొలగించిన 1200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు జీవో 1207 జారీ చేసింది. దీనిపై పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టిన జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం తాజాగా తుదితీర్పు జారీచేసింది. కోర్టు తీర్పు ద్వారా తొలగించిన వారిని ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ లేకుండా తిరిగి తీసుకోవడం చెల్లదని పేర్కొంది. 1207 జీవోను కొట్టేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కూడా 2002లో హైకోర్టు తీర్పు ప్రకారం మెరిట్‌ జాబితాలో ఉన్నవాళ్లనే కొనసాగించాలని పేర్కొంది. ఆ తర్వాత ఏమైనా ఖాళీలు ఏర్పడితే చట్టప్రకారం రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేపట్టవచ్చని తెలిపింది.

Updated Date - Dec 01 , 2024 | 05:03 AM