Job Recruitment: శరవేగంగా డాక్టర్ల నియామకం
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:19 AM
రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గత 11 నెలల్లోనే ఏకంగా 7,332 పోస్టులను వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు భర్తీ చేసింది.
5 నెలల్లో 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
ఎంపికైన డాక్టర్లకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గత 11 నెలల్లోనే ఏకంగా 7,332 పోస్టులను వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు భర్తీ చేసింది. తాజాగా మరో 442 పోస్టుల భర్తీ ప్రక్రియను ఐదు నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూన్ 28న బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ధ్రువపత్రాల పరిశీలన తదితర ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసి నవంబరు 23న ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాను విడుదల చేసింది.
ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏడాదికాలంలో ఆరోగ్యశాఖలోనే సుమారు 7,774 పోస్టులను భర్తీ చేశారు. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసి్‌స్ట(గ్రేడ్ 2), 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంఎన్‌జే) పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేేసందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే మరో 600కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.