Share News

High Court: మెయిన్స్‌కు ఓకే

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:18 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఊరట. మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులను హైకోర్టు తొలగించింది.

High Court: మెయిన్స్‌కు ఓకే

  • గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలన్న పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

  • మూడోసారీ రద్దయితే వ్యవస్థపై విశ్వాసం ఉండదు

  • పరీక్షలు జరుగుతాయనే నమ్మకం పోతుంది

  • అన్నీ పరిశీలించే నిపుణుల కమిటీ ‘కీ’ తయారీ

  • విస్తృతంగా చర్చించిన తర్వాతే సింగిల్‌ జడ్జి తీర్పు

  • దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు

  • ఎస్టీ రిజర్వేషన్‌ పెంచినా పోస్టులూ పెరిగాయి కదా

  • హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టీకరణ

  • గ్రూప్‌-1 వాయిదా కోరుతూ సుప్రీంలో పిటిషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఊరట. మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులను హైకోర్టు తొలగించింది. ప్రిలిమ్స్‌ (ప్రాథమిక పరీక్ష)ను రద్దు చేయాలని, ఫైనల్‌ కీలో తప్పులున్నాయని, రీ నోటిఫికేషన్‌ ఇవ్వడం చెల్లదని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు చెల్లదంటూ వివిధ కారణాలతో దాఖలైన పలు అప్పీల్‌ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ సందర్భంగా.. ‘మెయిన్స్‌ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 90 శాతం మంద అభ్యర్థులు హాల్‌ టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దయింది. మూడోసారి కూడా రద్దయితే వ్యవస్థపై విశ్వాసమే పోతుంది. పరీక్షలు జరుగుతాయనే నమ్మకం అభ్యర్థులకు కలగదు. తీవ్ర నైరాశ్యం నెలకొని ఆత్మహత్య ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.


అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, విస్తృతంగా చర్చించే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారని, అందులో జోక్యం చేసుకోవాల్సిన ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. ప్రశ్నల్లో తప్పొప్పులను కోర్టులు నిర్ణయించలేవని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిపుణుల కమిటీ ‘కీ’ విడుదల చేసిందని వివరించింది. ఎస్టీ రిజర్వేషన్‌ పెరిగినా.. పోస్టులు కూడా పెరిగాయని గుర్తు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో తప్పులు ఉన్నాయని, దానిని రద్దు చేయడంతోపాటు మెయిన్స్‌ పరీక్షలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్లను ఈనెల 15న సింగిల్‌ జడ్జి ధర్మాసనం కొట్టేసిన విషయం తెలిసిందే. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టేసి మెయిన్స్‌ పరీక్షలను అడ్డుకోవాలని కోరుతూ డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రిలిమ్స్‌ ఫైనల్‌ కీ తప్పులతడకగా ఉంది. పలు ప్రశ్నలపై అభ్యర్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ కమిటీ ఇచ్చిన కీని పక్కనపెట్టి స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలి.


ఒరిజినల్‌ నోటిఫికేషన్‌లో లేకుండానే ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచారు. దీనివల్ల మిగతా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. 2022లో అర్హత సాధించని వారు 2024లో అర్హత సాధించారు. దరఖాస్తులకు గడువు పొడిగించేది లేదని నోటిఫికేషన్‌లో పేర్కొని రెండు రోజులు పొడిగించారు. మెయిన్స్‌ పరీక్షలు, రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌సను తర్వాత చేపట్టాలి’’ అని కోరారు. ప్రభుత్వం, టీజీపీఎస్సీ తరఫున న్యాయవాదులు రాహుల్‌ రెడ్డి, పీఎస్‌ రాజశేఖర్‌ వాదిస్తూ.. ‘‘నోటిఫికేషన్‌ రద్దు, ఉపసంహరణ, సవరణ వంటి అన్ని అధికారాలూ కమిషన్‌కు ఉంటాయి. నిబంధనల ప్రకారమే రీ నోటిఫికేషన్‌ జారీ చేశాం. రీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో ఇచ్చాం. అప్పీలుదారులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చిన తర్వాత అర్హత సాధించకపోవడంతో రీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేశారు. అందుకే ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్‌ ఇస్తే చాలా ఆలస్యంగా ఆగస్టులో సవాల్‌ చేశారు’’ అని వివరించారు.


అత్యంత పారదర్శకంగా అన్ని అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే ఫైనల్‌ కీ విడుదల చేశామని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 31 వేలమంది పరీక్షల్లో పాల్గొంటున్నారని, 90 శాతానికిపైగా హాల్‌ టికెట్ల కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ రద్దయిందని, సింగిల్‌ జడ్జి అన్ని అంశాలు సవివరంగా చర్చించారని, కేవలం ఆరుగురు అప్పీలుదారుల కోసం వాయిదా వేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. రీ నోటిఫికేషన్‌ ఫిబ్రవరిలో ఇస్తే మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు సవాల్‌ చేశారని అప్పీలుదారులను ప్రశ్నించింది. పరీక్షల్లో పాల్గొని ఫలితాలు వచ్చిన తర్వాత సవాల్‌ చేయడం కరెక్ట్‌ కాదని వ్యాఖ్యానించింది. అప్పీళ్లను డిస్మిస్‌ చేస్తూ తీర్పు ఇచ్చింది.

Updated Date - Oct 19 , 2024 | 03:18 AM