Lab Technicians: ఎల్టీలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:13 AM
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ల్యాబ్ టెక్నిషీయన్స్ (ఎల్టీ), జూనియర్ అనలిస్టులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నిషీయన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
మెడికల్ ల్యాబ్ టెక్నిషీయన్స్ అసోసియేషన్ డిమాండ్
కలకలం రేపిన ఆంధ్రజ్యోతి ‘పైసలిస్తే పదోన్నతులు’ కథనం
విచారణకు ఆదేశించిన హెల్త్ సెక్రటరీ
కథనంపై వివరణ ఇచ్చిన డీహెచ్ కార్యాలయం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ల్యాబ్ టెక్నిషీయన్స్ (ఎల్టీ), జూనియర్ అనలిస్టులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నిషీయన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో డీహెచ్ కార్యాలయ ఉన్నతాఽధికారులకు వినతి పత్రం ఇచ్చారు. గత 30 ఏళ్లుగా పదోన్నతులు లేకుండా ఒకే పోస్టులో కొనసాగుతున్నామని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. తక్షణమే సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఉన్నతాఽధికారులను కోరారు.
మరోవైపు ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో పదోన్నతులపై పైసలిస్తేనే పదోన్నతుల ఫైల్ కదులుతుందంటూ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. దీనిపై హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు స్పందించి విచారణకు ఆదేశించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. మరోవైపు ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై డీహెచ్ రవీంద్రనాయక్ వివరణ ఇచ్చారు. ఆరో జోన్ పరిధిలో ఫార్మాసిస్టుల సీనియారిటీపై అభ్యంతరాలున్నాయని, ఇంకా తుది సీనియారిటీ జాబితాను ఖరారుచేయాల్సి ఉందన్నారు. సంబంధిత అధికారులను సర్వీస్ వివరాలు పంపమని కోరామన్నారు.