Share News

Hyderabad: చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:13 AM

మర్రి చెన్నారెడ్డి గొప్ప పరిపాలనాదక్షుడు, మార్గదర్శకుడు, రాజనీతిజ్ఞుడు, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు.

Hyderabad: చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత

  • గొప్ప పాలనాదక్షుడు.. ఆయన సేవలు మరువలేనివి

  • వర్నర్లు జిష్ణుదేవ్‌, దత్తాత్రే య, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

కవాడిగూడ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మర్రి చెన్నారెడ్డి గొప్ప పరిపాలనాదక్షుడు, మార్గదర్శకుడు, రాజనీతిజ్ఞుడు, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి 28వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఇందిరాపార్కులోని చెన్నారెడ్డి మెమోరియల్‌ రాక్‌గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడారు. చెన్నారెడ్డి ముందు చూపు ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.


తెలంగాణ ఉద్యమానికి చెన్నారెడ్డి స్ఫూర్తి అని దత్తాత్రేయ అన్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా సేవలందించారని పేర్కొన్నారు. చెన్నారెడ్డి గొప్ప రాజకీయ వేత్త అని, ముందుచూపు కలిగి ఉన్న వ్యక్తి అని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఎంపీటీసీగా, జడ్‌పీటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని.. నేడు స్పీకర్‌ అయ్యానని తెలిపారు. చెన్నారెడ్డి విషయ పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞుడు, దూరదృష్టి గల గొప్ప నేత అని ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, మర్రి చెన్నారెడ్డి తనయులు మర్రి శశిధర్‌రెడ్డి, మర్రి రవీందర్‌రెడ్డి, చెన్నారెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయనకు అంజలి ఘటించారు.

Updated Date - Dec 03 , 2024 | 04:13 AM